మత మార్పిడి చేసిన ఎస్సీలపై తీర్పు రాజ్యాంగ విరుద్ధం

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీలకు ఎస్సీ ఎస్టీ చట్టం, ప్రభుత్వ రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని దళిత హక్కుల పోరాట సమితి (డిహెచ్‌పీఎస్) మండల కన్వీనర్ పరికి కోర్నేలు విమర్శించారు. నల్లబెల్లి గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ తీర్పు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ (ఆర్టికల్ 25), సమానత్వ హక్కులు (ఆర్టికల్ 14, 15) స్ఫూర్తిని దెబ్బతీస్తోందన్నారు.
కుల వివక్ష కారణంగానే ఎస్సీలు క్రైస్తవ మతాన్ని ఆశ్రయించారని పేర్కొన్నారు. అగ్రవర్ణాల ఆధిపత్యం అన్ని మతాల్లో కొనసాగుతోందని, క్రైస్తవ మతంలో కూడా నిర్ణయాత్మక స్థానాల్లో ఎస్సీలు లేకపోవడం ఆందోళనకరమన్నారు. అదే సమయంలో ఇతర వర్గాలకు రిజర్వేషన్లు కొనసాగుతుండగా, ఎస్సీలకు వాటిని నిరాకరించడం అన్యాయమని తెలిపారు.
ప్రభుత్వాలు మతాన్ని ఆధారంగా చేసుకుని హక్కులను హరించే విధానాలు విడనాడాలని, ఎస్సీలు ఏకమై తమ హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొమ్మకంటి అనిల్, గూడెపు భాస్కర్, బీసీ హక్కుల సాధన సమితి నాయకులు కడియాల క్రాంతి కుమార్, మామిండ్ల చిన్న ఐలయ్య, మామిండ్ల పెద్ద ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
