Top Story | దారి లేదు .. డొంక లేదు.. నీరే నీరు – ఊరు ఖాళీ అవుతోంది


కనుచూపు మేరలో నీరే నీరు
జోరువానలోనూ పడవ ప్రయాణమే
ఇక బడులున్నా.. చదువు సున్నా
పని లేదు.. ఉపాధి హామీ లేదు
ఆ ఊరిలో అంతా ఇరకాటమే
ఇదీ ఇరకం దీవి ధీన స్థితి

అది పులికాట్ సరస్సు. పకృతి అందచందాలకు నెలవు. విదేశీ పక్షులకు విడిది వనం. ఈ సరస్సులోనే ఓ వన్నెచిన్నెల దీవి పలకరిస్తుంది. ఇక్కడ పుట్టినోళ్లు.. పుట్టిన ఊరిని వదలలేక పుట్టిన గడ్డలోనే మట్టికావాలని భీష్మిస్తే.. ఈ తరం మాత్రం ఏమున్నదక్కో ఏమున్నదక్కా.. ముల్లె సదురుకున్న… ఎల్లి పోతా ఉన్న ఈ ఊర్లో నాకింక ఏమున్నదక్కో.. ఏమున్నదక్కా అంటూ మదన పడిపోతున్నారు. ఎందుకంటే.. ఈ ఊరికి దారి లేదు. డొంక లేదు. వంతెన లేదు. ప్రాణం మీదకు వస్తే పడవ ఎక్కాల్సిందే. ఇక వందేళ్ల కిందటి బడి ఉన్నా చదువు చెప్పే అయ్యవార్లు కరువు. ఆసుపత్రి లేదు. డాక్టర్లను అడగకూడదు. ఈ స్థితిలోనే ఈ ఊరిజనం భవిష్యత్తు ఓ ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకీ ఈ ఊరి పేరు తెలుసా? అదే ఇరకం. ఊరిజనానికి ఇరకాటం. ఏపీ సర్కారు ఏలుబడిలో.. కనీస అవసరాలు తీరని ఈ దీవి జనం దీన గాథ తెలుసు కుందాం.

( ఆంధ్రప్రభ, సెంట్రల్ డెస్క్) – ఇది ఆంధ్రా.. – తమిళనాడు సరిహద్దుల్లో పులికాట్ సరస్సు మధ్యలో ఇరకం దీవి. ఈ దీవిలో రెండు ఊళ్ళు ఉన్నాయి. ప్రధాన ఇరకం గ్రామంలో మొదలి యార్లు, దళితులు, యానాదులు ఉంటారు. ఇదే పంచాయితీ పరిధిలోని పాళెం తోపు కుప్పం గ్రామంలో మత్స్యకారులు ఉంటారు. ఈ దీవి ఆంధ్రలో ఉన్నప్పటికీ వీరందరి మాతృభాష తమిళం. ఇరకం జనానికి వ్యవసాయం, పాళెం తోపు కుప్పం ప్రజలకు చేపలవేట జీవనాధారం. ఊళ్లోఉపాధి లేదు.. ఆ ఊరి నుంచి బయటకు వెళ్లాలన్నా, లోపలికి రావాలన్నా పడవ తప్ప మరో మార్గం లేదు. పని దొరకాలన్నా, పనులు కావాలన్నా గంటసేపు పడవలో ప్రయాణించాల్సిందే. నిత్యవసరాలు, వంట సరుకులు, గ్యాస్ సిలెండర్లు నుంచి మొదలు ట్రాక్టర్లు, వరికోసే మెషీన్ల వరకూ ఏదైనా పడవ మీద రావాల్సిందే. ఆ పడవ ప్రయాణం కూడా అంత తేలిక కాదు. దారిలో బోటు మోటార్ ఆగిపోతే కనుచూపు మేరలో నీరు తప్ప భూమి కనపడని నీటి మధ్యలో మరో పడవ వచ్చే వరకూ గంటల తరబడి పడగాపులు కాయాల్సిందే. ఎదురు చూడాల్సిందే. ఇక దారి మధ్యలోనే పడవలోనే ప్రసవ వేదన పడిన తల్లులూ ఉన్నారు.

భవిష్యత్తుపైనే.. భయం

ఈ దీవిలో జీవిత కాలం మనుగడ కష్టమైంది. ఇన్నాళ్లు ఈ ఊరి జనం అనేక తిప్పలు పడ్డారు. కనీసం తమ బిడ్డల భవిష్యత్తుపైనే ఇక్కడి ఈ తరం తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ బడి ఉంది. కానీ అయ్యవార్లు ఇక్కడ ఉండటానికి ఇష్టపడరు. ఇలా బదిలీపై వచ్చి అలా డిప్యుటేషన్ పై వెళ్లిపోతారు. వేరే ఊళ్లో చదివించాలని తల్లిదండ్రులు భావిస్తే.. ఇక్కడి పిల్లలు బడికి వెళ్లాలంటే కిలోమీటరు పైన నడచి, మరో 7 కిలోమీటర్లు పైగా సరస్సులో పడవ ప్రయాణం చేయాలి. సుమారు 50 నిమిషాలకు పైగా బోటులో ప్రయాణం చేయాలి. తిరిగి కొంత దూరం నడవాలి. వాయుగుండంతో.. తుపానుతో వాన వచ్చిందో.. బడికి వెళ్లలేరు.

రెండు బడుల్లో చదువు సున్నా..

ఇరకం గ్రామంలో రెండు పాఠశాలలు ఉన్నాయి. ఒక అంగన్ వాడీ కేంద్రం కూడా ఉంది. ఒక స్కూలును పూర్తిగా మూసి వేశారు. ఉపాధ్యాయులు లేకపోవడమే అందుకు కారణం. మరో అంగన్ వాడీ కేంద్రంలో పది మంది పిల్లలు కూడా చదవడం లేదు. ఆ బడిలో పనిచేసే ఏకైక ఉపాధ్యాయుడు పడవలో వచ్చి వెళతారు.
పడవ సమయాల ప్రకారం ఆయన ఆ బడిలో పాఠాలు చెప్పేది రెండు గంటల కంటే మించడం లేదు. దీంతో పిల్లలకు చదువు అబ్బటం లేదని అక్కడకు తమ పిల్లలను తల్లిందండ్రులు పంపడం లేదు. ఇది సరే విచిత్రంగా ఈ రెండో బడిని తల్లిదండ్రులే స్వయంగా నిర్మించారు. వందేళ్ల కిందటే బడికి పక్కా భవనం ఉన్న ఊరిలో, ఇప్పుడు ఉపాధ్యాయులు లేక బోసిపోయింది. ఈ గ్రామం నుంచి సుమారు 130 మందికి పైగా పిల్లలు రోజూ ఇలా పడవలోనే ప్రయాణం చేసి బడికి వెళతారు.
వారిలో కొందరు భీములపాళెంలోని ఆంధ్ర ప్రభుత్వ పాఠశాలలో, మరికొందరు సున్నాం బళకుళంలోని తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో, మరి కొందరు తమిళనాడులో అరంబాక్కం వెళ్లి ప్రైవేటు స్కూళ్లల్లో చదువుతున్నారు.


ఊరు ఖాళీ అవుతోంది.

”మా తరం అయిపోయింది. పిల్లలు చదువుకోవాలి కదా? ఒకప్పుడు కరెంటు లేని రోజుల్లో ఇక్కడ బతికారు. ఇప్పుడు ఇక్కడ ఉండలేని పరిస్థితి. ఇక్కడ ఆదాయం లేదు. బయటకు వెళ్లే ఉపాధి మార్గమూ లేదు. ఎవరు వచ్చినా వారానికి మించి ఉండలేరు. కొన్నేళ్ళుగా ఈ గ్రామస్థులు ఊరిని ఖాళీ చేస్తూ వస్తున్నారు. సంపన్న కుటుంబాల వారు నగరాలకు తరలిపోయారు. మిగిలిన జనం తడ మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లిపోయారు. అవకాశం ఉన్న తల్లిదండ్రులు పిల్లలను తమిళనాడు, ఆంధ్రలోని హాస్టళ్లల్లో, బంధువుల ఇళ్ళల్లో పెట్టి చదివిస్తున్నారు. అవకాశం లేని గ్రామస్తులు తామే స్వయంగా ఊరు వదిలి తడ పరిసరాల్లో అద్దెకు ఉంటూ పిల్లలను చదివిస్తున్నారు. ఇదీ ఇరకం సర్పంచి గుణ కథనం

పరిష్కారం ఏంటీ?

ప్రస్తుతం ఈ దీవి వదిలేసి అనేక మంది భీములవారి పాళెం వెళ్తున్నారు. పిల్లల చదువుల కోసం ఈ దీవి వదలి అద్దె ఇళ్లకు వెళ్తున్నారు. వ్యవసాయ పనులు కూడా లేవు. వరి కోతల కోసం మిషన్ వచ్చింది. వంద రోజుల పని దినాల్లో పది రోజులు కూడా జరగటం లేదు. ముఖ్యంగా రవాణా సౌకర్యం కావాలి. అదే ముఖ్యం. వేనాడుకు ఇరకాటం మధ్య వంతెన వేసి, రోడ్డు వేయాలి. కంకర రోడ్డు అయినా పర్లేదు. కానీ పక్షుల అభయారణ్యం ఉందని వంతెన నిర్మాణానికి అటవీ శాఖ ఒప్పుకోవడం లేదు. ఇస్రోకు అభ్యంతరం లేకపోతే రోడ్డు వేసుకోవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. రవాణా సౌకర్యం ఉంటేనే ఈ ఊరికి భవిష్యత్తు. ప్రభుత్వం బోటు ఇచ్చింది. ఇటీవలే ఈ బోటుకు మరమ్మత్తులను కూడా ప్రభుత్వం చేయించింది. తడ దగ్గర్లో భూమి కావాలని ఇరకం ప్రజలు కోరారు. ఈ ప్రక్రియ జరుగుతోంది. ఈలోపు మెరుగైన బోటు, రవాణా ఏర్పాట్లు అందేలా చేస్తాం. మత్స్యాకారులు, రైతుల ఆదాయం పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం.” అని ఏపీ అధికారులు ఇరకం ప్రజలను సముదాయించటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *