హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో A1గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి స్వదేశానికి రాబోతున్నట్లుగా ప్రకటించారు.
ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన ఈ నెల 5న విచారణకు హాజరుకాబోతున్నట్లుగా ఇవాళ ఉదయం కేసు ఇన్వెస్టిగషన్ టీమ్‌కు ముందస్తు సమాచారం అందజేశారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పూర్తిగా సహకరిస్తానని సుప్రీం కోర్టుకు ప్రభాకర్ రావు ఓ అండర్‌టేకింగ్ లెటర్‌ను కూడా మెయిల్ ద్వారా పంపారు.
కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే భారత్‌కు తిరిగి వస్తానంటూ మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కేసులో సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ మే2న తీర్పును వెలువరించింది. దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభాకర్ రావు సవాలు చేస్తూ మే 9న సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఫోన్ ట్యాంపింగ్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలేనని, చికిత్స నిమిత్తమే తాను అమెరికా వెళ్లినట్లుగా ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దేశానికి తిరిగి వస్తానని ఆయన ప్రభాకర్ రావు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది.
కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయకూడదంటూ దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది. అదేవిధంగా ఆయనకు వీలైనంత త్వరగా పాస్‌పోర్టు ఇవ్వాలని ఆదేశించింది. ఆ పాస్‌పోర్టు అందిన 3 రోజుల్లోగా భారత్‌కు వచ్చి విచారణకు పూర్తిగా సహకరించాలని ప్రభాకర్ రావును ఆదేశించింది.