Tomatoes | అడిగినోళ్లకు అడిగినన్ని …..ఎక్కడంటే….

Tomatoes | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మొన్నటి వరకు కిలో 50 రూపాయలు పలికిన టమోట ధర పరిస్థితి పడిపోయింది. ఆ పంట పండించిన రైతులు దిగాలుగా ఉండే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడలో జరిగిన ఆందోళనాత్మక ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టమాటాకు ధరలు లేక పంటను అమ్మకానికి తరలించిన రైతులు, మార్కెట్లో కనీస గిట్టుబాటు ధర కూడా దొరకకపోవడంతో, తమ టమాటాలను ఉచితంగా ప్రజలకు సరఫరా చేసి తమ నిరాశను వ్యక్తం చేశారు.

వారాంతపు సంతలో జరిగిన ఈ సంఘటనలో 1200 కిలో టమాటాలు ఉచితంగా పంపిణీ చేయడం రైతుల మరొక వినూత్న నిరసన రూపంగా నిలిచింది. పెరిగిన పంట ఖర్చులు, దిగజారిన ధరలు, అప్పులు చేసి సాగు చేయడానికి ఉన్న ఒత్తిడి, ఈ వ్యవసాయ పరిస్థితిని మరింత కష్టం చేస్తోంది. ఈ సంఘటన రైతులకు ప్రభుత్వం త్వరగా సహాయం అందించాలని, వారి ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించాలన్న ఆవేదనను ప్రతిబింబిస్తుంది.

ఇప్పుడు టమాటా ధరలు నేల చూపులు చూస్తున్నాయి. రైతులు కనీసం కిలో 2 రూపాయల ధర పలకని టమాటా ధర చూసి బిత్తర పోతున్నారు. చేతికి అందిన ఆ పంటను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉచితంగా సరఫరా చేస్తున్నారు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 1200 కిలోల ఒక ట్రాలీ లోడ్ టమాటాలు ఉచితంగా పంపిణీ చేశారు.

మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం భూపతిపేట గ్రామానికి చెందిన సారయ్య, మోహన్, సురేందర్ అనే రైతులు టమాట పంటను అమ్మకానికి తీసుకువచ్చారు. అయితే ఆశించిన స్థాయిలో గిరాకీ లేకపోవడంతో పాటు ధరలు అమాంతంగా పడిపోయాయి. దీంతో తీవ్ర నిరాశ చెందిన రైతులు ఆ టమాటా ఇంటికి తీసుకెళ్లలేక అక్కడే ఉచితంగా పంపిణీ చేశారు. అప్పులు చేసి కష్టపడి పంట వేస్తే ధరలు దారుణంగా పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పంటను వేసి తాము చాలా నష్టపోయామని.. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Leave a Reply