వెలగపూడి – ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజ్నొవా నేడు తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారిని దర్శించుకోనున్నారు. అగ్నిప్రమాదం నుంచి తన కుమారుడు క్షేమంగా బయటపడిన నేపథ్యంలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారామె. సోమవారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకుంటారు. స్వామివారి సేవలో పాల్గొంటారు.
నేడు సాయంత్రం బయలుదేరి తిరుమలకు వెళ్లనున్నారు. ఈ రాత్రి కి పవన్ దంపతులు తిరుమల లో బస చేస్తారు. రేవు ఉదయం తిరుమల శ్రీనివాసుని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా అన్నా లెజ్నొవా తన కుమారుడు మార్క్ పేరు మీద ఒక రోజు అన్న ప్రసాద వితరణకు అయ్యే ఖర్చు రూ 44 లక్షలను విరాళంగా ఇవ్వనున్నారు
కాగా, . ఆరోగ్యం కుదుటపడిన నేపథ్యంలో ఇక తనయుడితో కలిసి పవన్ కల్యాణ్ స్వదేశానికి గత రాత్రి చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కుమారుడిని ఎత్తుకుని కనిపించారు పవన్. ఆయన పక్కనే అన్నా లెజ్నోవా ఉన్నారు.
విమానాశ్రయంలో కొందరు పార్టీ నాయకులు వారికి స్వాగతం పలికారు.పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్.. సింగపూర్ పాఠశాలలో సంభవించిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. రివర్ వ్యాలీ రోడ్‌లో మూడంతస్తుల భవనం సోప్‌హౌస్‌లో గల టమాటో కుకింగ్ స్కూల్‌లో మంటలు చెలరేగిన ఘటనలో మార్క్ శంకర్‌తో పాటు 16 మంది చిన్న పిల్లలు గాయపడ్డారు.కుకింగ్ లెసన్స్ బోధించడం, దానికి అనుగుణంగా క్యాంప్ నిర్వహిస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సమాచారం అందిన వెంటనే సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్సెస్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాయి. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. మూడు అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పివేశాయి.ఈ ఘటనలో గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించారు.
మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు కాలిన గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లో పొగ వెళ్లడం వల్ల ఐసీయూలో చికిత్స అందించాల్సి వచ్చింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, సురేఖ.. హుటాహుటిన సింగపూర్‌కు బయలుదేరి వెళ్లారు. డిశ్చార్జ్ అయ్యేంత వరకూ అక్కడే ఉన్నారు.ఆ తరువాత శంకర్ ఆరోగ్యం గురించి చిరంజీవి ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇచ్చారు. బాబు ఆరోగ్యం బాగుందని, ప్రస్తుతం కోలుకుంటోన్నాడని చిరంజీవి వెల్లడించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడనీ చెప్పారు. తమ కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి.