ఎద్దుకు పునర్జన్మ ఇచ్చిన పశువైద్యాధికారి..

కుభీర్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి (కె) గ్రామంలో పశువైద్యాధికారులు అరుదైన శస్త్ర చికిత్స చేసి ఓ ఎద్దు ప్రాణాలను కాపాడారు. గ్రామానికి చెందిన రైతు బందెల శంకర్‌కు చెందిన ఎద్దు నాలుగు రోజులుగా మూత్రం చుక్కలు చుక్కలుగా మాత్రమే పోస్తుండటంతో దాని కడుపు తీవ్రంగా ఉబ్బిపోయింది.

ఈ విషయం గమనించిన రైతు శంకర్ వెంటనే పల్సి పశువైద్యాధికారిని సంప్రదించారు. అయినప్పటికీ ఎద్దు పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో భైంసా పట్టణ పశువైద్యాధికారి డాక్టర్ గుంశెట్టి విఠల్‌కు సమాచారం అందించారు.

సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్డి (కె) గ్రామానికి వెంటనే చేరుకున్న డాక్టర్ విఠల్ అక్కడే రెండున్నర గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స నిర్వహించారు. ఎద్దు మూత్రనాళాల్లో ఏర్పడిన రాళ్లను తొలగించి మూత్రాన్ని బయటకు పంపించారు.

మూత్రనాళాల్లో రాళ్లు ఏర్పడి మూత్రం ఆగిపోవడంతో తీవ్రంగా అవస్థపడుతున్న ఎద్దు ప్రాణాలను ఈ శస్త్రచికిత్సతో కాపాడగలిగారు. చావుబతుకుల మధ్య ఉన్న ఎద్దు మళ్లీ లేచి నిలబడటంతో రైతు కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. సుమారు రూ.70 వేల విలువైన ఎద్దును కాపాడిన డాక్టర్ విఠల్‌ను గ్రామస్థులు అభినందించారు.

వేసవిలో జాగ్రత్తలు అవసరం..

ఈ సందర్భంగా భైంసా పశువైద్యాధికారి డాక్టర్ విఠల్ మాట్లాడుతూ.. వేసవికాలంలో డీహైడ్రేషన్ కారణంగా పశువుల మూత్రనాళాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందన్నారు. అందుకే పశువులకు రోజుకు మూడు పూటలా ఉప్పు కలిపిన నీటిని తాగించాలన్నారు. రైతులు నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశముందని ఆయన సూచించారు.

Leave a Reply