TG | ప్రభుత్వ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లండి – సీఎల్పీ భేటీలో రేవంత్ ఆదేశం

భూ భారతి మహాద్భుతం –
వందేండ్ల సమస్యకు పరిష్కారం చూపాం
ప్రజా ప్రభుత్వంలోని ప‌థ‌కాలు ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి
స‌న్న బియ్యం ప‌థ‌కం చరిత్రలో నిలిచిపోతుంది
బీజేపీ పాలిత‌ రాష్ట్రాల్లో ఎందుకు అమ‌లు చేయ‌డం లేదు
తెలంగాణ ప‌థ‌కాల‌తో ప్ర‌ధాని మోదీ ఉక్కిరిబిక్కిరి
ప్ర‌తి ఎమ్మెల్యే ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావాలి
రేపటి నుంచి గ్రామాల్లో విస్తృతంగా ప‌ర్య‌టించాలి
హెచ్‌సీయూ భూములపై ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారం
ప్ర‌భుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ విషం చిమ్ముతున్నాయి
సీఎల్పీ భేటీలో మండిప‌డ్డ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ :
ప్రజా ప్రభుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మనం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల్సిన‌ బాధ్యత అందరిపై ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు హోట‌ల్‌లో నేడు జ‌రిగిన‌ సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింద‌న్నారు. భూ భారతి ఓ మహాద్భుతమని కొనియాడారు. సన్నబియ్యం పథకం ఒక అద్భుతమైంద‌న్నారు. ఆనాడు ₹2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండిపోతుందన్నారు. మనం ఎంత మంచి చేసినా.. ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదని, మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల‌ని సూచించారు.

తెలంగాణ ప‌థ‌కాల‌తో ప్ర‌ధాని ఉక్కిరిబిక్కిరి

నిన్న మొన్నటి దాకా కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి మనపై విమర్శలు చేశార‌ని, ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగార‌ని విమర్శించారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఉక్కిరి, బిక్కిరి అవుతున్నార‌న్నారు. వర్గీకరణ మోదీకి గుదిబండగా మారింద‌న్నారు. కులగణన మోదీకి మరణశాసనం రాయబోతోంద‌ని, దేశంలో తెలంగాణ మోడల్ పై చర్చ జరుగుతోంద‌న్నారు. అందుకే తెలంగాణలో కాంగ్రెస్​ను ఇబ్బంది పెట్టాలనే బీజేపీ, బీఆరెస్ ఒక్కటయ్యాయ‌ని చెప్పారు. సన్న బియ్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. స‌న్న బియ్యం మన పథకం.. మన పేటెంట్, మన బ్రాండ్ అని సీఎం స్పష్టం చేశారు.

భూ భారతిని రైతులకు చేరవేయాలి

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భూభార‌తి ని రైతుల‌కు చేరువ అయ్యేలా చూడాల‌న్నారు. దీనిపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. దేశంలోనే ఇందిరమ్మ ఇండ్లు పథకం ఆదర్శంగా నిలిచింద‌న్నారు. క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్ది దారులకు ఇందిరమ్మ ఇండ్లు అందాల‌న్నారు. దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.

వందేళ్ల స‌మ‌స్య‌ను శాశ్వ‌తంగా ప‌రిష్కారం

సీఎం మాట్లాడుతూ కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించామ‌న్నారు. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చామ‌ని, ఇది మన పారదర్శక పాలనకు నిదర్శనమ‌ని అన్నారు. జటిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామ‌ని, అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని గుర్తు చేశారు.

రేప‌టి నుంచి ఎమ్మెల్యేలు గ్రామాల్లో ప‌ర్య‌టించేలా

ప్ర‌తి ఎమ్మెల్యే ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వ్వాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ రూపొందించుకోవాల‌న్నారు. తాను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికే సమయం కేటాయిస్తాన‌ని చెప్పారు. హెచ్ సీ యూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ఒక అబద్ధపు ప్రచారం చేసింద‌న్నారు. ఈ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారని, బీజేపీ, బీఆరెస్ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయ‌న్నారు. పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుంద‌న్నారు. మీ నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోవాల‌ని, ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *