TG బడ్జెట్లో ప్రవచనాలు ఎక్కువ .. పైసలు తక్కువ! – ఎమ్మెల్సీ క‌విత‌

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ బడ్జెట్ లో ప్రవచనాలు ఎక్కువ పైసలు తక్కువ ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చెప్పిన మాటలే చెప్పడం తప్ప.. అందులో ఎలాంటి నిజాలు లేవన్నారు. ప్రభుత్వం కట్టిన అప్పు 30 వేల కోట్ల రూపాయలు మాత్రమే.. కానీ, లక్ష 40,000 కోట్లు అప్పు క‌ట్టిన‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్ప‌డం శుద్ధ అబద్దామ‌న్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 4, 37,000 కోట్ల రూపాయల అప్పు ఉంది.. కానీ, ఏడు లక్షల కోట్ల అప్పు అని కేసీఆర్ ప్రభుత్వంపై నిందలు వేశారు.. బడ్జెట్ బుక్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినవన్నీ అబద్ధాలని తేలింద‌ని కవిత మండిపడ్డారు.

ప‌ర నింద త‌ప్ప ఏం లేదు…


బడ్జెట్ లో ఆత్మస్తుతి, పరనింద తప్ప ఏం లేదని మండలి విపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలే కనిపించాయి.. ఎన్నో హామీలను ఇచ్చి.. అన్ని తుంగలో తొక్కి.. ఆశల మీద నీళ్లు చల్లారు అని ఆరోపించారు. వైద్య, విద్య, మహిళ సంక్షేమంలో సరైన న్యాయం జరగలేద‌ని, రాష్ట్రాన్ని ఛిద్రం చేసి ఇబ్బందుల్లోకి నెట్టార‌ని అన్నారు. ఇది తిరోగమన బడ్జెట్ అని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్లలో కావాల్సిన నిధులు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టులను నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వం.. అవగాహన రాహిత్యం వల్ల కాంగ్రెస్ చేతగాని తనం వల్ల ప్రజలు నష్టపోతున్నారు అని మండిపడ్డారు. ఎండిపోయిన లక్ష ఎకరాలకు నష్ట పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *