Summer-Arts-Camp | పిల్లల భవిష్యత్తుకు మరో బాట

Summer-Arts-Camp | పిల్లల భవిష్యత్తుకు మరో బాట
Summer-Arts-Camp | హైదరాబాద్ ఆంధ్రప్రభ: విద్యార్థి దశ నుంచే పిల్లలను చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో ప్రోత్సహించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
శనివారం రవీంద్రభారతిలో సనత్‌నగర్‌కు చెందిన శ్రీ నాట్యశిల్పి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, వేసవి సెలవుల్లో విద్యార్థులకు నెల రోజుల పాటు ఉచితంగా జానపద, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అకాడమీ నిర్వాహకులు వాసుకి శ్రీనివాస్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

జానపదం, కూచిపూడి కేవలం నృత్య రూపాలు మాత్రమే కాదని, అవి మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్న నేటి తరానికి భారతీయ కళల పట్ల అవగాహన కల్పించడం అవసరమని పేర్కొన్నారు.

వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ పిల్లలను నృత్య శిక్షణకు పంపిన తల్లిదండ్రులను అభినందించారు. చిన్నప్పటి నుంచే పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దితే భవిష్యత్తులో గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారని చెప్పారు.

అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న 100 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో సనత్‌నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ బాల్‌రెడ్డి, అకాడమీ నిర్వాహకులు వాసుకి శ్రీనివాస్, పుష్పలత, నాయకులు అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
CLICK HERE TO READ MORE : APSRTC | టికెట్ ధరల పెంపుపై మంత్రి స్పష్టీకరణ
