క్యూలైన్‌లో శుభ్రత, భద్రతపై కఠిన ఆదేశాలు..

- ఉచిత క్యూలైన్లో దర్శనం చేసుకున్న కలెక్టర్ లక్ష్మీశ
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : దసరా శరన్నవరాత్రుల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శనివారం సాయంత్రం జేసీ ఇలక్కియ, విజయవాడ ఆర్డిఓ కె. చైతన్య, నందిగామ ఆర్డిఓ కే.బాలకృష్ణ, తిరువూరు ఆర్డీవో కె. మాధురి, డిఆర్ఓ లక్ష్మీ నరసింహం, ఇతర ముఖ్య అధికారులతో కలిసి పరిశీలించారు.
వినాయకుడి గుడి నుంచి అమ్మవారి గుడి వరకు ఉన్న క్యూలైన్లలో కాలినడకన వెళ్లి అణువణువునా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. మిగిలిన క్యూలైన్లతో పోల్చితే ఉచిత క్యూలైన్ దర్శనంతో ఆలయ గోపురాలను, ధ్వజస్తంభాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
ఉచిత క్యూలైన్ లో పరిసరాలను చక్కగా పరిశీలించవచ్చని, కృష్ణమ్మ అందాలనూ వీక్షించవచ్చని అన్నారు. సాధారణ భక్తులకే పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ఉచిత క్యూ లైన్ లో మంచినీటి కి కొత్త గ్లాసులు ఏర్పాటు చేయాలని, బేసిన్లను యాసిడ్ తో శుభ్రం చేయించాలని ఆదేశించారు.
గోవులను తరలించిన అనంతరం ఆ ప్రాంతాన్ని శుభ్రపరచకపోవడంపై ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటర్లలో పోస్టర్లు చినిగి ఉండటాన్ని గమనించి వెంటనే కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యూ లైన్ లో ఉన్న ఎత్తుపల్లాలను సరిచేయాలని చెప్పారు.
చెట్టు ముందున్న ద్వారం తలుపు దెబ్బతిన్నడాన్ని గమనించి, వెంటనే మరమ్మతులు చేయించాలని చెప్పారు. అనంతరం భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జేసీ కలెక్టర్ ఇలక్కియ, విజయవాడ ఆర్డిఓ కె. చైతన్య, నందిగామ ఆర్డిఓ కే. బాలకృష్ణ, తిరువూరు ఆర్డీవో కె. మాధురి, డిఆర్ఓ లక్ష్మీ నరసింహం, డిఆర్డిఎ పిడి ఏఎన్ వి నాంచారరావు, డిపిఓ లావణ్య కుమారి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బాని, డిప్యూటీ లేబర్ కమిషనర్ ధనలక్ష్మి, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.
