SP | ఆపరేషన్ స్మైల్ ద్వారా 151 మంది గుర్తింపు

SP | ఆపరేషన్ స్మైల్ ద్వారా 151 మంది గుర్తింపు

  • ఎస్పీ స్నేహమేహరా

SP | వికారాబాద్, ఆంధ్రప్రభ : ఆపరేషన్ స్మైల్-XII ద్వారా 151 మంది చిన్నారుల రక్షణ.-జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర, చిన్నారుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ‘ఆపరేషన్ స్మైల్-XII’ కార్యక్రమంలో భాగంగా మొత్తం 151 మంది చిన్నారులను రక్షించినట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర తెలిపారు. రక్షించబడిన వారిలో 130 మంది బాలురు, 21 మంది బాలికలు ఉన్నారని పేర్కొన్నారు.

ఈ ఆపరేషన్ ద్వారా బాలకార్మికులుగా మగ్గుతున్న 104 మందిని, బడి మానేసిన (డ్రాపౌట్స్) 45 మందిని, అలాగే భిక్షాటన చేస్తున్న ఇద్దరు బాలికలను సురక్షితంగా ఆపరేషన్ స్మైల్ టీం రక్షించారు. వీరిలో తెలంగాణేతర రాష్ట్రాలైన బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ మరియు అస్సాం రాష్ట్రాలకు చెందిన 26 మంది చిన్నారులు కూడా ఉన్నారని ఎస్పీ వివరించారు.

జిల్లాలోని మూడు సబ్ డివిజన్ల వారీగా రక్షణ చర్యలను వివరిస్తూ పరిగి సబ్ డివిజన్‌లో అత్యధికంగా 59 మందిని, వికారాబాద్ సబ్ డివిజన్‌లో 46 మందిని, తాండూర్ సబ్ డివిజన్‌లో 46 మంది చిన్నారులను రక్షించినట్లు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి చిన్నారులతో పని చేయిస్తున్న యజమానులపై జిల్లా వ్యాప్తంగా మొత్తం 32 ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపినారు. రక్షించబడిన వారిలో 130 మంది పిల్లలను వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించామని, సరైన సంరక్షణ లేని 21 మంది బాలురను చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్స్ కు తరలించినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. “పిల్లలు బడిలో ఉండాలి కానీ పనిలో కాదు. బాల్యానికి అండగా నిలవడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశ్యం. బాలకార్మిక వ్యవస్థను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తప్పవు,” అని హెచ్చరించారు. చిన్నారుల హక్కులను కాపాడటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ గారు కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో పోలీస్, మహిళా, శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ లేబర్, హెల్త్ , ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్లతో పాటు సాధన అంకిత స్వచ్ఛంద సంస్థలు, చైల్డ్ లైన్ అధికారులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ బృందాలలో అంకితభావంతో పనిచేసిన అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరినీ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply