Sharmila l మోడీ తీరు నామ్ నరేంద్ర.. కామ్ సరెండర్..

Sharmila l మోడీ తీరు నామ్ నరేంద్ర.. కామ్ సరెండర్..

ఇండియాకు గ్రేట్ డీల్ కాదు.. బ్లాక్ డీల్..
వైఎస్ షర్మిలా రెడ్డి

Sharmila l ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరోః అమెకాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం ఇండియాకు గ్రేట్ డీల్ కాదని, ఇది దేశ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించే బ్లాక్ డీల్ అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ తీరు నామ్ నరేంద్ర.. కామ్ సరెండర్ అన్నట్లుగా ఉందని వ్యాఖ్యానిస్తూ, ఆయన అమెరికా చేతిలో కీలుబొమ్మలా మారారని ఆరోపించారు. అగ్రరాజ్యం బ్లాక్ మెయిల్‌కు తలొగ్గి దేశ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని, ఈ వాణిజ్య ఒప్పందం దేశ భవిష్యత్తుకు పొంచి ఉన్న ప్రమాదమని హెచ్చరించారు. సున్నా సుంకాలతో భారత మార్కెట్‌ను అమెరికా ఉత్పత్తులకు తెరిచేస్తే స్వదేశీ ఉత్పత్తులకు ఇది మరణశాసనమేనని షర్మిలా అన్నారు.

దేశ రైతాంగానికి, పరిశ్రమల రంగానికి ఇది నిజంగా బ్లాక్ డే అని వ్యాఖ్యానిస్తూ, మోడీ చేసిన ఈ బ్లాక్ డీల్ మన రూపాయి భవితవ్యాన్నే దెబ్బతీసేలా ఉందని, భారత ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఇండియా ఎగుమతులపై అమెరికా సుంకాలు 18 శాతం తగ్గిస్తే, ఆ దేశ దిగుమతులపై మోడీ ప్రభుత్వం సుంకాలు సున్నాగా చేయడం ఏమిటని ప్రశ్నించారు. మన దేశ ఉత్పత్తులపై మొన్నటిదాకా అమెరికా విధించిన పన్నులు కేవలం 5 శాతం లోపే ఉన్నాయని, వాటిని 5 నుంచి 50 శాతం వరకు పెంచి, ఇప్పుడు అందులో 18 శాతానికి తగ్గిస్తే దాన్ని భారత్‌కు లాభం ఎలా అంటారని నిలదీశారు. సుంకాలు తగ్గడంతో భారత్‌కు దక్కే ప్రయోజనం కంటే, సున్నా సుంకాలతో అమెరికాకు మాత్రం వంద శాతం లాభమని, ఇండియా రైతులకు ఉరి పెట్టి అమెరికా వ్యవసాయ రంగానికి మోడీ గ్రేట్ డీల్ ఇచ్చారని విమర్శించారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం మేక్ ఇన్ ఇండియా నినాదానికి మోడీ తిలోదకాలు ఇచ్చారని, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తే మళ్లీ సుంకాలు 50 శాతం పెంచుతామని ట్రంప్ బహిరంగంగా హెచ్చరిస్తున్నారంటే ఇది స్పష్టమైన బ్లాక్ మెయిల్ కాదా అని ప్రశ్నించారు. ట్రంప్ పెట్టిన భయానికి మోడీ బయటపడ్డారంటే అది విదేశాల ఎదుట సాగిలపడినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు. వాణిజ్య ఒప్పందాలు అంటే రెండు దేశాలకు సమతూకంగా లాభం చేకూర్చేవి కావాలని, ఒక దేశానికి నష్టం, మరో దేశానికి లాభం జరిగే వాటిని ఒప్పందాలు ఎలా అంటారని ఆమె నిలదీశారు.

అమెరికా ప్రయోజనాల కోసం 75 ఏళ్ల వాణిజ్య ఒప్పందాల చరిత్రను మోడీ తుంగలో తొక్కారని, 50 కోట్ల వ్యవసాయ ఆధారిత కుటుంబాల కన్నా అమెరికా ప్రయోజనాలే మోడీ కి మిన్నగా మారాయని ఆరోపించారు. ఏటా 100 బిలియన్ డాలర్ల దేశ సొమ్మును అమెరికాకు అప్పనంగా కట్టబెట్టే కుట్ర ఇదని ఆమె వ్యాఖ్యానించారు. భారత ప్రధాని విదేశాల ఎదుట లొంగిపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని షర్మిలా తెలిపారు. మోడీ వెంటనే ఈ సరెండర్ ఒప్పందం ను పూర్తిగా ప్రజల ముందుంచాలని డిమాండ్ చేస్తూ, సున్నా సుంకాలు విధించే రెండు మూడు వస్తువుల గురించి మాత్రమే చెప్పడం కాకుండా, అమెరికా నుంచి దిగుమతి కాబోయే అన్ని ఉత్పత్తులు, వాటిపై విధించే పన్నుల పూర్తి వివరాలను తక్షణమే బహిర్గతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply