Rs. 1.02 crore | బాధితులకు ఊరట

Rs. 1.02 crore | బాధితులకు ఊరట
- హిట్ అండ్ రన్ బాధితులకు అండగా ఎన్టీఆర్ పోలీసులు రూ.2 కోట్ల పరిహారం మంజూరు
- రోడ్డు ప్రమాదాల్లో న్యాయం దిశగా ఎన్టీఆర్ కమిషనరేట్ కీలక అడుగు
- 238 కేసుల్లో 247 మందికి పరిహారం , మానవతకు నిలువెత్తు నిదర్శనం
- ప్రమాద బాధిత కుటుంబాలకు ఊరటగా నిలిచిన హిట్ అండ్ రన్ పథకం
Rs. 1.02 crore | విజయవాడ క్రైమ్, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాల్లో నిందిత వాహనాన్ని గుర్తించలేని హిట్ అండ్ రన్(Hit and run) కేసుల బాధితులకు ఊరటనిచ్చే విధంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కీలక పాత్ర పోషిస్తోంది. సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హిట్ అండ్ రన్ నష్టపరిహార పథకం కింద ఇప్పటివరకు 238 కేసుల్లో 247 మంది బాధితులకు మొత్తం రూ.2 కోట్ల పరిహారం అందేలా చర్యలు తీసుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు నేతృత్వంలో, పోలీస్–రెవెన్యూ శాఖల సమన్వయంతో పరిహార దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించారు. ఇందులో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన 51 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున, అలాగే ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన 196 మందికి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం(compensation) మంజూరు చేశారు.
ఈ పరిహార పథకం మానవతా కోణానికి అద్దం పడుతుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎండి ఫారుక్ ఉదంతం దీనికి స్పష్టమైన ఉదాహరణ. ఉపాధి కోసం గుంటూరు జిల్లా తాడేపల్లిలో కుటుంబంతో నివసిస్తూ నూడుల్స్ బండి నిర్వహిస్తున్న ఫారుక్, 2024 న భార్యతో కలిసి విజయవాడకు సరుకుల కోసం వచ్చి తిరిగి వెళ్తుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన భార్య తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
స్థానిక భాష తెలియని పరిస్థితిలో ఉన్న ఫారుక్‌కు పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు(Officials) పూర్తి సహకారం అందించారు. అవసరమైన పత్రాలను రెవెన్యూ శాఖ ద్వారా సేకరించి, క్లెయిమ్స్ ఎంక్వయిరీ అధికారుల ద్వారా జిల్లా కలెక్టర్‌కు పంపించి, అక్కడి నుంచి జీఐసీ, ముంబైకి పంపడం ద్వారా తక్కువ సమయంలోనే రూ.2 లక్షల పరిహారం ఆయన బ్యాంకు ఖాతాకు జమ అయ్యేలా చేశారు.
ఇప్పటివరకు హిట్ అండ్ రన్ కేసుల్లో మృతి చెందిన వారి వారసులకు రూ.1.02 కోట్లు(Rs. 1.02 crore), గాయపడిన బాధితులకు రూ.98 లక్షలు అందించి, మొత్తంగా రూ.2 కోట్ల పరిహారాన్ని మంజూరు చేయించారు. దీంతో రాష్ట్ర స్థాయిలోనే ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ప్రథమ స్థానంలో నిలిచింది.
హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులు నిర్లక్ష్యానికి గురికాకుండా రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిహారం అందిస్తోందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే కేసు నమోదు, పత్రాల సేకరణ, క్లెయిమ్ ప్రక్రియ(Claim process)ను వేగంగా పూర్తి చేయడం ద్వారా బాధిత కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం, ట్రాఫిక్ ఏసీపీ పి. రామచంద్రరావు, హెడ్ కానిస్టేబుల్ ఎన్.వి. శ్రీనివాసరావు, పోలీస్ కానిస్టేబుల్ వి. లీలసాయి కిరణ్‌లను నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.
