Robbery | రెండు నిమిషాల్లోనే…

Robbery | రెండు నిమిషాల్లోనే…
రూ. కోటి విలువైన నగలను దోచుకెళ్లారు..
Robbery | పుణె, ఆంధ్రప్రభ : ఇటీవల కాలంలో నగరాలు, పట్టణాల్లో దోపిడీలు ఆందోళనకరంగా పెరిగిపోతున్నాయి. రోడ్లపై, ఇళ్లలో, వాణిజ్య సముదాయాల్లో జరుగుతున్న ఈ దోపిడీలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. చైన్ స్నాచింగ్, ఇంటి దొంగతనాలు, ఏటీఎం దొంగతనాలు, నగల దుకాణాల్లో దోపిడీ (Robbery), రోడ్డుపై దోపిడీలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
అయితే తాజాగా… మహారాష్ట్ర (Maharashtra) లోని పుణేలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలే ఆయుధాలతో ఓ నగల దుకాణంలోకి చొరబడ్డారు. రెండు నిమిషాల్లో కోటి రూపాయల విలువైన ఆభరణాలను దోచేశారు (Robbery worth one crore jewellery). దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఖానాపుర్ (Khanapur) ప్రాంతంలోని వైష్ణవి నగల దుకాణంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో యజమానితో సహా ఆయన కుటుంబసభ్యులు షాపులోనే ఉన్నారు. ఈ క్రమంలో ఐదుగురు దొంగలు రెండు బైకులపై వచ్చి షాపులోకి చొరబడ్డారు. ఆయుధాలు చూపించి వారిని బెదిరించి చోరీకి పాల్పడ్డారు. కేవలం రెండు నిమిషాల్లోనే రూ.కోటి విలువైన ఆభరణాలు కాజేశారు. ఈ ఘటన మొత్తం షాపులోని సీసీటీవీలో రికార్డయ్యింది.
దోపిడీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి.. సీసీటీవీ ఫుటేజీ (CCTV footage) ని స్వాధీనం చేసుకొని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దొంగతనానికి కొన్ని రోజుల ముందు నుంచే నిందితులు ఈ ప్రాంతంలో రెక్కీ చేశారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.పట్టపగలే దొంగతనం జరగడంతో మిగతా వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
