రైతుల బలోపేతం కోసం ‘‘రైతన్న మీకోసం’’

- కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : రైతును ఆర్థికంగా బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ‘‘రైతన్న మీకోసం’’ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ రైతన్న మీకోసం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమక్షంలో నిర్వహించారు.
కుముదవల్లిలోని రైతు భూపతి రాజు సత్యనారాయణ మండువా పెంకుటిల్లు అరుగుపై ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రైతులతో కలిసి అరుగుపై కూర్చుని ముఖాముఖిగా మాట్లాడడం రైతులను ఎంతో ఉత్సాహపరిచింది.
జిల్లా కలెక్టర్ రైతులతో ఆ విధంగా కూర్చుని మాట్లాడడంతో వారు కూడా వారి సాధక బాధకాలను, వరి పంట సాగులో వారి అనుభవాలను మనసు విప్పి స్వతంత్రంగా వివరించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రైతులతో మాట్లాడుతూ… రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా ప్రతి రైతు ఇంటికే అధికారులు వెళ్లి సేంద్రియ విధానాలు, అగ్రిటెక్, శాస్త్రీయ సాగు పద్ధతులు వివరించనున్నట్లు చెప్పారు. రైతుల సూచనలు, వాతావరణ హెచ్చరికలు, పంట రక్షణ సమాచారం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రైతు యాప్ రూపొందించిందని తెలిపారు.
పంట వేయడం నుంచి కోత వరకు అవసరమైన సమాచారమంతా ఈ యాప్‌లో లభిస్తుందని, రైతులు తప్పనిసరిగా వినియోగించాలన్నారు. జిల్లా వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా డ్రోన్ సేవలు అందుబాటులో ఉన్నాయని, ఇవి ఖర్చును తగ్గించి, పిచికారీ ప్రభావాన్ని పెంచుతాయని వివరించారు.
జిల్లాలో వ్యవసాయం పాటు ఆక్వా రంగం కూడా బలంగా అభివృద్ధి చెందుతుందని, ఇది విదేశీ మారకద్రవ్య ఆర్జనకు దోహదం చేస్తోందని చెప్పారు. అనంతరం కలెక్టర్ రైతుల ఇళ్లకు వెళ్లి “రైతన్న మీకోసం – రైతు సేవలో మన మంచి ప్రభుత్వం” కరపత్రాలను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో జెడ్.వెంకటేశ్వరరావు, ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఏడీఏ శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
