ఇరు దేశాలు తలపడితే పాకిస్తాన్‌కే తీవ్ర నష్టం
భారత సైనిక శక్తిలో సగం బలమే వారికి
రక్షణ రంగంలో భారీ స్థాయిలో పారామిటరీ బలగాలు
4,500 యుద్ధ ట్యాంకులు, 538 యుద్ధ విమానాలు
ఆధునిక ఆయుధాలు.. భారీ క్షిపణి వ్యవస్థ
బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు, ఆధునిక ఫిరంగి దళాలు
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైన్యం భారత్ సొంతం
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : పహల్గామ్ ఉగ్ర దాడి తమ పనేనని లష్కరే తోయిబా ప్రకటించిన వేళ భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కసిగా ఉంది. ఉగ్ర మూకల ఏరివేతకు దాయాది దేశం సహకరించకపోతే, పాకిస్తాన్‌పై సైనిక చర్యకు ఉపక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాయాది దేశాల మధ్య యుద్ధం వస్తే.. భారత్‌ను తట్టుకుని పాక్ నిలబడడం చాలా కష్టమని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు.
గ్లోబల్ ఫైర్ పవర్ నివేదిక ఇదే..
ప్రపంచవ్యాప్తంగా సైనిక బలాన్ని ర్యాంక్ చేసే ప్రసిద్ధ సంస్థ అయిన గ్లోబల్ ఫైర్‌పవర్ నివేదికల ప్రకారం.. భారత్ వద్ద 14 లక్షల మంది యాక్టివ్ సైనికులున్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైన్యం భారత్ సొంతం. ఒక వేళ యుద్ధం వచ్చి ఇరుదేశాలు తలపడితే, పాకిస్తాన్ సైన్యం.. భారతదేశానికి వ్యతిరేకంగా ఎన్నో రోజులు నిలబడలేదన్నది సుస్పష్టం. పాకిస్తాన్ సైన్యం భారత్ సైనిక పరిమాణంలో సగం కంటే తక్కువ. భారత రక్షణ రంగంలో పెద్ద పారా మిలిటరీ ఉంది.
అత్యాధునిక ఆయుధాలు..
భారత్‌కు 4,500 యుద్ధ ట్యాంకులు, 538 యుద్ధ విమానాలు, ఆధునిక ఆయుధాలు.. భారీ క్షిపణి వ్యవస్థ ఉంది. భారత సైన్యం కేవలం సంఖ్యల పరంగానే కాకుండా బలమైన సాంకేతికత, తయారీ, వ్యూహాత్మక స్థానాల్లోనూ బాగా మెరుగ్గా ఉంది. ఇంకా రెండు దేశాలకు శక్తివంతమైన సైన్యాలు ఉన్నప్పటికీ, భారతదేశ సైన్యం మూడు దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చాలా పెద్దవి. అధునాతనమైనవి.
వీటిని పాక్ తట్టుకోగలదా..
యుద్ధం అంటూ వస్తే.. పూర్తి సన్నద్ధతో ఉన్న భారత సైనిక సామర్థ్యం ముందు పాకిస్తాన్ ఎంతో కాలం నిలబడలేదన్నది ఫైర్‌పవర్ సంస్థ అంచనా. భారత్ వద్ద 25 లక్షలకు పైగా పారామిలిటరీ దళాలు, అధునాతన యుద్ధ సామగ్రి, అర్జున్ మెయిన్ బాటిల్ ట్యాంకులు, T-90 ‘భీమ్’ ట్యాంకులు, పినాకా మల్టీ-బారెల్ రాకెట్ లాంచర్లు, బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు, హోవిట్జర్లు,ఆధునిక ఫిరంగి దళాలున్నాయి.