27న వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణం..

27న వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణం..
భవానిపురం, ఆంధ్రప్రభ : శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం కొత్తపేటలోని శ్రీ నగరాల సీతారామస్వామి వారి దేవస్థానంలో శ్రీ సీతారామ స్వామి వార్ల కళ్యాణోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మ వార్ల దేవస్థానం కమిటీ కార్యదర్శి మరుపిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు (పిసి) చెప్పారు. గురువారం దేవస్థానం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

శ్రీరామనవమి ఉత్సవాలను ప్రతి ఏటా అత్యంత ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నట్లు వారు వివరించారు. దీనిలో భాగంగా ఈనెల 25వ తేదీ నుండి 30వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారామస్వామి వార్ల కళ్యాణోత్సవం జరుగుతుందని, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, విజయవాడ పశ్చిమ సభ్యులు వై. సుజనా చౌదరి తదితర ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు.
అలాగే 28వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు వన్ టౌన్ పురవీధుల్లో రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహిస్తామని చెప్పారు. 102 సంవత్సరాల చరిత్ర గల ప్రత్యేకమైన రథంపై శ్రీ సీతారామ స్వామివార్లను ఊరేగించడం జరుగుతుందన్నారు. అలాగే 30వ తేదీన సాయంత్రం స్వామివారి పవళింపుసేవ జరుగుతుందని వారు వివరించారు.
సమావేశంలో కమిటీ గౌరవ అధ్యక్షులు బెవర సూర్యనారాయణ, అధ్యక్షులు మరుపిళ్ళ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు బెవర శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొరగంజి భాస్కరరావు, కార్యవర్గ సభ్యులు మజ్జి శ్రీనివాసరావు, నరసింహారావు,విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
