ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలు..

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలు..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానుంది. దాదాపు 60 ఏళ్లుగా అమలులో ఉన్న పాత ఆదాయపు పన్ను చట్టానికి బదులుగా కొత్త Income Tax Act 2025 అమల్లోకి వస్తుండటంతో దేశంలోని పన్ను వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్త చట్టం ద్వారా పన్ను విధానాన్ని సులభతరం చేయడం, అనవసర నిబంధనలను తొలగించడం, డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తోంది. ప్రారంభ దశలో పాత చట్టం, కొత్త చట్టం రెండూ కొన్ని సంవత్సరాలు సమాంతరంగా అమలులో ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
కొత్త ఆదాయపు పన్ను చట్టంతో పన్ను రిటర్న్ ఫైలింగ్, పన్ను చెల్లింపులు, పాన్, హెచ్‌ఆర్‌ఏ వంటి అంశాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా పన్ను విధానాన్ని సరళీకరించడం, పారదర్శకత పెంచడం, వివాదాలను తగ్గించడం ఈ చట్టం ప్రధాన లక్ష్యంగా పేర్కొంటున్నారు. అదే విధంగా పాత Assessment Year, Financial Year వ్యవస్థకు బదులుగా Tax Year అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశముంది. పన్ను చట్టంలో సెక్షన్లు, ఫారమ్‌లు తగ్గించి సులభంగా అర్థమయ్యేలా రూపొందించారు. కొత్త చట్టం అమలులోకి రావడంతో ఉద్యోగులు, వ్యాపారులు, పన్ను చెల్లింపుదారులు తమ పన్ను లెక్కలను తిరిగి పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాత, కొత్త పన్ను విధానాల మధ్య సరైన ఎంపిక చేసుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చని చెబుతున్నారు.
