AP | వైసీపీ జండాతో నాని అజెండా : ఎమ్మెల్యే కొలికపూడి

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : వైసీపీ జెండాను భుజాలపై మోస్తూ, తాడేపల్లి స్క్రిప్ట్ నే అజెండాగా చేసుకునే మాజీ ఎంపీ కేశినేని నాని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు విమర్శించారు. రాజకీయాలు, పలుకబడితో బ్యాంకులను బురిడీ కొట్టించిన నాని తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపించారు. కొత్తగా ఏర్పాటు చేసిన సెల్ కంపెనీలకు ఆదాయాన్ని పెద్ద ఎత్తున మళ్లిస్తున్నారని ఆ కంపెనీలపై పూర్తిస్థాయిలో సిబిఐ విచారణ జరపాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. నిష్కల్మషంగా జిల్లా ప్రజలకు ప్రజాసేవ చేస్తున్న ఎంపీ కేశినేని చిన్నికి అండగా జిల్లాలోని ఏడుగురు శాసనసభ్యులతో పాటు ప్రజలంతా ఆయన వెనుకే ఉన్నారని చెప్పారు.

విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రజా జీవితంలో వున్నా వాళ్ళు మాట్లాడే మాటలు, వ్యక్తిగత వ్యాపార విషయాలు, ప్రజలు నిశితంగా గమనిస్తారని చెప్పారు. మాజీ ఎంపీ కేశినేని నాని ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్నిపై బురద చల్లే కార్యక్రమం, గుడ్డ కాల్చి మీద వేసే కార్యక్రమం చేస్తున్నారని, ఇది ఎంతమాత్రం సహించరానిదన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మెడికల్ క్యాంపులు, జాబ్ మేళాలు, అన్నా క్యాంటీన్ లు అనేక సేవా కార్యక్రమాలు చేసి, జిల్లా ప్రజల మనసు గెలిచి ప్రజల నుండి వచ్చిన వ్యక్తి చిన్ని అన్నారు. ఇలాంటి వ్యక్తి పై బురద చల్లి లిక్కర్ స్కాం ను డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు.

ఉద్దేశ పూర్వకంగా కేశినేని నాని బ్యాంకు రుణం ఎగ్గొట్టి తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఒక కంపెనీ పెట్టి రుణం తీసుకుని బ్యాంకుని మోసం చేసి, కంపెనీ పేరుమార్చి భార్య భర్తలు ఇద్దరు పేర్లు మార్చి తన దగ్గర పని చేసి ఇద్దరినీ డైరెక్టర్స్ గా పెట్టి బ్యాంకులకు బురిడీ కొట్టించారని తెలిపారు. ఆదాయాన్ని డైవర్ట్ చేసి ఆంధ్ర క్యాంటీన్ ప్రైవేట్ లిమిటెడ్ అని కూతుర్లని పెట్టి అక్కడ మోసం చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఏదొక సంస్థను అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరాలకి నాని పాల్పడినట్లు తెలిపారు. టీం ఎన్టీఆర్ జిల్లా లో 7మంది శాసనసభ్యులు ఈ 11 నెలల కాలంలో చిన్ని చేసిన అభివృద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. మీరు 10 సంవత్సరాల్లో చేసింది ఏంటో చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *