TG |ఎగ్గొట్టుడుకి, అబద్ధాలకు రేవంత్ బ్రాండ్ అంబాసిడర్ : హరీశ్ రావు

గజ్వేల్, ఏప్రిల్13 ఆంధ్రప్రభ గజ్వేల్ పట్టణం లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం బిఆర్ ఎస్ నాయకులతో మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఈనెల27న జరిగే వరంగల్ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.పది సంవత్సరాల బీఆర్ ఎస్ పాలనలో పెద్ద మీటింగ్ పెట్టలేదని, బీఆర్ఎస్ పార్టీ అవతరించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టారన్నారు.

ఎలక్షన్ లలో తప్ప ఇప్పుడు పెట్టే ఈ మీటింగ్ ప్రతిష్టాత్మకం అయ్యిందన్నారు.ప్రతి నియోజకవర్గం నుండి కార్యకర్తలు స్వచ్ఛందంగా వస్తామంటున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుండి లక్ష మంది హాజరు కావాలని కేసీఆర్ టార్గెట్ ఇచ్చారన్నారు.

ఎంత స్పీడ్ గా కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అంతే స్పీడ్ గా గ్రౌండ్ లో కుప్ప కూలిందన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాకా ఆస్తులు అమ్ముకుందామనుకున్నా, కుదవ పెడదామన్నా వీలులేకుండా పోయిందని గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని ఎద్దేవా చేశారు. వ్యాపారాలు పూర్తిగా నడవడం లేదని ఏ వ్యాపారిని అడిగిన అంటున్నారన్నారు. రేవంత్ పాలనపట్ల ప్రజలు విసిగిపోయారని ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందన్నారు.

ఒక్కో మండలం లో చూస్తే 5100 మందికి రుణమాఫీ అయితే, 7300 మందికి రుణ మాఫీ కాలేదని దీనిపై అసెంబ్లీలో నిలదీసిన విషయం మీకు తెలుసు నన్నారు.గజ్వేల్ లో ప్రతి కులానికి ఏదో విధంగా బీఆర్ ఎస్ పాలనలో న్యాయం చేశామని, కుల సంఘాల వారికి కమ్యూనిటీ బిల్డింగ్లు, ఆలయాలు ఇలా ఎన్నో చేశామని చెప్పారు.

స్థానిక సంస్థలు ఎన్నికలలో బిఆర్ ఎస్ పార్టీకి లాభం అవుతుందని కష్టపడి పనిచేస్తే మీ అందరికి అవకాశాలు వస్తాయని మీ అందరికి నా సంపూర్ణ మద్దతు సహకారం ఉంటుందన్నారు. నాయకులు సమావేశానికి కార్లలో కాకుండా కార్యకర్తలతో బస్సులో రావాలని ప్రతి ఒక్కరు కష్టపడి మీటింగ్ సక్సెస్ అయ్యే వరకు ఉండాలని సూచించారు.

సభకు వచ్చిన కార్యకర్తలను, నాయకులు ఇంటికి చేర్చే వరకు జాగ్రత్త తీసుకోవాలని అందరం ఇందుకోసం శ్రమించాలని చెప్పారు. మహిళ నాయకులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని,అక్కడ మీటింగ్ జరిగే ప్రాంతంలో మహిళలకు ప్రత్యేక గ్యాలరీ పది వేల మంది కూర్చునేలా ఏర్పాటు చేశారన్నారు.వచ్చిన ప్రతి కార్యకర్త సభకు హాజరుకావాల్సిందేనని కేసీఆర్ ప్రసంగం అయ్యే వరకు క్రమశిక్షణతో ఉండాలనన్నారు.

నాయకులు మండలాల వారిగా సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నాయకులు పనిచేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనమే గెలుస్తాం అని ధీమా వ్యక్తంచేశారు.గజ్వేల్ నియోజకవర్గం లో రెండు మున్సిపాలిటీలు మనమే గెలుస్తాం అని కేసీఆర్ ప్రభుత్వం పోయాక గజ్వేల్ మళ్ళీ వెనుకబడిన విషయం ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఇండ్లు, షాపులు కిరాయికి దొరికేవి కావని, ఇప్పుడు ఎక్కడ చూసినా టూ లెట్ బోర్డు లు కనపడుతున్నాయన్నారు.

దేవుడి పై ఒట్టు పెట్టి దేవుణ్ణే మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, అటు అసెంబ్లీ లో ఇటు బయట ఎక్కడైనా అబద్ధాలు చెప్తాడని ఆరోపించారు. యంగ్ ఇండియా స్కూల్ బ్రాండ్ అని రేవంత్ రెడ్డి అన్నాడు.ఇచ్చిన హామీలు ఎగ్గొట్టుడు, అబద్ధాలు చెప్పడం, చెట్లు నరకుడు ఇవి రేవంత్ రెడ్డి బ్రాండ్ లు అని స్పష్టం చేశారు.

మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మీ, రైతుబందు, రైతు బీమా ఇవి కేసీఆర్ బ్రాండ్ అని అన్నారు. చెట్లు పెట్టుడు కేసీఆర్ వంతు అయితే చెట్లు నరకుడు రేవంత్ రెడ్డి వంతు అని అన్నారు.ఎకరాలకు ఎకరాలు చెట్లు నరికిస్తున్నాడని ,400 ఎకరాల భూమి కూద పెట్టి 10 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని , సమాచార హక్కు చట్టం ప్రకారం అప్లికేషన్ పెట్టానని కానీ రేవంత్ రెడ్డి వల్ల అధికారులు బలి అయ్యే పరిస్థితి వచ్చిందనన్నారు.

సమాచార హక్కు చట్టం ప్రకారం ఆ ఫైల్స్ చూడడానికి అప్లికేషన్ పెట్టిన అన్నారు. జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీ లేచే పరిస్థితి లేదన్నారు. గ్రామాలలో సన్న బియ్యం ఇస్తున్నారని అందులో 40 శాతం నూకలే అని సహపంక్తి భోజనం పేరిట ఇంటి నుండి క్యారెజ్ తీసుకొని కాంగ్రెస్ నాయకులు బిల్డఫ్ ఇస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారన్నారు. నూకలు లేకుండా గురుకులాలకు కేసీఆర్ ఏ విధంగా సన్న బియ్యం ఇచ్చారో దమ్ముంటే అదే విధంగా ఇవ్వండి అన్నారు.

వడ్లు కొనమని అడిగితే నూకలు బుక్కండి అన్నది బిజెపి ప్రభుత్వం కాదా అని, నూకలు ఉన్న బియ్యం ప్రజలకు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. 14 వేల కోట్ల రూపాయల రైతు బంధు ఎగ్గొట్టి అసంపూర్తిగా రుణ మాఫీ చేసిండని అవి కూడా పూర్తిగా చేయని అసమర్థ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం అని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం లో కరోనా కాలం లో కూడా రైతు బంధు ఇచ్చాడని కాంట్రాక్టర్ లకు బిల్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అని గుర్తుచేశారు.

నేడు కాంట్రాక్టర్ లను ఇబ్బంది పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని 20 శాతం కమిషన్ కొట్టు బిల్లు కొడతాం అని అంటుంది మీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.సెక్రటేరియట్ లో కాంట్రాక్టర్ లు ధర్నా చేస్తున్నారని ఇటువంటి ప్రభుత్వం ఎప్పుడు చూడలేదని మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వయంగా మా ప్రభుత్వం పని ఐపోయినట్టే అని మాతో అంటున్నారన్నారు. మళ్ళీ గెలిచేది లేదని వారే అంటున్నారన్నారు. కష్టపడ్డ కార్యకర్తలను గెలిపించుకుందామని భవిష్యత్తు మీదే అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *