వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా వేయించుకోవాలి

వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా వేయించుకోవాలి
- అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేట, ఆంధ్రప్రభ : గర్భాశయ క్యాన్సర్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను 9 నుండి 14 సంవత్సరాల ఆడబిడ్డలందరూ తప్పనిసరిగా వేయించుకోవాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సూచించారు.
ఆదివారం అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన హెచ్‌పీవీ వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 9 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తున్నందున విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
గర్భాశయ క్యాన్సర్ నివారణలో ఈ టీకా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా వైద్య సిబ్బందిని ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రవికుమార్, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ తారా సింగ్, డీసీహెచ్ఎస్ రామకృష్ణ, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రదీప్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, ఓబీసీ సెల్ నాయకుడు గిరి వర్ధన్ గౌడ్, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
