Megastar | చిరుతో విజయ్ తండ్రి మూడు సినిమాలు తీసారా…?

Megastar | చిరుతో విజయ్ తండ్రి మూడు సినిమాలు తీసారా…?

టాలీవుడ్ తో విజయ్ తండ్రికి అనుబంధం

Megastar |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కోలీవుడ్ స్టార్ హీరో జోసెఫ్ విజయ్ తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రెండేళ్లలోనే అధికారంలోకి వచ్చి అందరికీ షాక్ ఇచ్చారు.. చరిత్ర సృష్టించారు. దీంతో విజయ్ గురించి.. విజయ్ ఫాదర్ చంద్రశేఖర్ గురించి వార్తలు రావడం.. అవి వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరుగుతుంది. తాజాగా విజయ్ తండ్రి చంద్రశేఖర్ కి తెలుగు సినిమాతో ఉన్న అనుబంధం ఏంటనేది వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో విజయ్ తండ్రి ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు సినిమాలు తీసారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

విజయ్ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆయన తల్లి శోభ ఒక సింగర్, రైటర్. అంతే కాకండా నిర్మాతగా, డైరెక్టర్ గానూ కొన్ని సినిమాలు చేశారు. విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ ప్రముఖ దర్శకుడు, నిర్మాత, రచయిత. తమిళంతో పాటుగా తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలకు వర్క్ చేశారు. అన్నీ కలిపి 70కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. నటుడిగానూ ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు.

తెలుగు సినిమాలో విజయ్ పేరెంట్స్…
విజయ్ తల్లిదండ్రులు తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో 3 బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. ఎస్‌ఏ చంద్రశేఖర్‌ కెరీర్ ప్రారంభంలో చిరంజీవి, లక్ష్మి, మాధవి ప్రధాన పాత్రల్లో చట్టానికి కళ్ళు లేవు అనే సినిమాని తెరకెక్కించారు. ఇది తమిళంలో ఆయన తీసిన ‘సట్టం ఒరు ఇరుత్తరై’ మూవీకి రీమేక్. ఆయనకు తెలుగు డెబ్యూ. దీనికి చిరంజీవి సన్నిహితుడు, నటుడు జీవి నారాయణ రావు నిర్మాతగా వ్యవహరించారు. 1981లో వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఇదే సినిమాని కన్నడలోనూ రీమేక్ చేశారు.

1983లో చిరంజీవి, రాధిక ప్రధాన పాత్రల్లో ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా పల్లెటూరి మొనగాడు. ఇది ‘నెంజిలె తునివిరుంతల్’ అనే తమిళ చిత్రానికి రీమేక్. తెలుగులోనూ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నమోదైంది. ఆతర్వాత 1984లో చిరంజీవి, విజయశాంతి హీరోహీరోయిన్లుగా దేవాంతకుడు అనే సినిమాని తెరకెక్కించారు చంద్రశేఖర్. ‘గెలువు నన్నదే’ అనే కన్నడ చిత్రం ఆధారంగా తీసిన మూవీ ఇది. దమయంతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నారాయణరావు నిర్మించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. చిరు కెరీర్లో దూసుకెళ్లడానికి తోడ్పడిన సినిమాలలో ఇదొకటి. అయితే.. చిరంజీవి నటించిన చట్టానికి కళ్ళు లేవు, పల్లెటూరి మొనగాడు, దేవాంతకుడు సినిమాలకు విజయ్ తల్లి శోభ స్వయంగా కథ అందించడం విశేషం. ఇలా.. విజయ్ తల్లిదండ్రులకు తెలుగు సినిమాతో.. చిరంజీవితో మంచి అనుబంధం ఉంది.