PTM| తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల (of teachers) సమావేశం (పీటీఎం 3.0) కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో డిసెంబర్ 5న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏకకాలంలో ఘనంగా నిర్వహించాలంటూ కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. గతంలో జరిగిన మెగా పీటీఎం 1.0, 2.0 విజయాలను దృష్టిలో ఉంచుకొని, ఈసారి మరింత సమగ్రంగా, ప్రభావవంతంగా కార్యక్రమం సాగాలని ఆయన సూచించారు. ఇందుకోసం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
మెగా పీటీఎం 3.0లో ప్రజా ప్రతినిధులు, జిల్లా, మండల అధికారులు, పాఠశాల మేనేజ్‌మెంట్ (Management) కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, దాతలు, తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పాఠశాలల్లో విద్యార్థుల భవిష్యత్తు, పాఠశాలాభివృద్ధిపై చర్చ జరిగేలా కార్యక్రమాన్ని సమగ్రంగా రూపుదిద్దాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యక్రమంలోని ముఖ్య అంశాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులను భాగస్వామ్యం చేసేందుకు ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్లు, తల్లుల కోసం రంగోలి పోటీలు (Rangoli competitions) నిర్వహించనున్నారు. విద్యార్థుల అకడమిక్, ప్రవర్తన, హాజరు, నైపుణ్యాలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి అన్ని అంశాలను కలిగిన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేయనున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రతి తల్లిదండ్రితో ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా మాట్లాడి సూచనలు ఇవ్వనున్నారు.

