Maktal | ఏకగ్రీవం చేస్తే 5లక్షలు..

Maktal | ఏకగ్రీవం చేస్తే 5లక్షలు..
మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైతే, ఆయా గ్రామాల అభివృద్ధి కోసం రూ.5 లక్షలు నజరానా అందించనున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి ప్రకటించారు.
పంచాయతి ఎన్నికలు ప్రారంభమైన సందర్భంగా శనివారం ఆంధ్రప్రభతో మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో పాటు తనవంతుగా అదనంగా రూ.5 లక్షలు అందజేయడం ద్వారా గ్రామాల అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు. ఏకగ్రీవ ఎన్నికలు గ్రామీణ అభివృద్ధికి దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులలో 90 శాతం కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని, గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయాలంటే బీజేపీ అభ్యర్థులు గెలవడం అవసరమని లక్ష్మికాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను బలపరచి గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు.
మక్తల్, మాగనూరు, కృష్ణ, ఊట్కూర్, నర్వ, అమరచింత, ఆత్మకూరు మండలాల్లో ఏ గ్రామ పంచాయతీలో అయినా బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైతే, ప్రతి గ్రామానికి రూ.5 లక్షలు అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గ్రామాల పురోగతికోసం బీజేపీ అభ్యర్థులను సర్పంచులుగా ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
