నర్సింహులపేట, (ఆంధ్రప్రభ) : అన్నంపెట్టే రైతన్నకు అడుగడుగునా సవాళ్ళే. వ్యవసాయం అంటేనే నిత్యం అనేక ఒడిదుడుకుల వ్యవహారం. లాభాల సంగతి దేవుడెరుగు కనీసం పెట్టిన పెట్టుబడైనా దిగుబడి వస్తే బాగుండనే పరిస్థితి. ఎన్నో దశలు దాటుకుంటూ పంట పండించే క్రమంలో అతిపెద్ద సవాల్ గా మారింది యూరియా కొరత.

రైతన్నలకు యూరియా కష్టాలు తప్పడం లేదు.. పొలం పనులు మానేసి పొద్దున్నే సద్ది తెచ్చుకుని ఒక్క బస్తా అయినా వస్తే చాలు అని ఎదురుచూపులు చూస్తూ.. గోదాముల వద్ద నిరీక్షిస్తున్నారు.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల రైతులు.నాట్లు వేసి 20 రోజులు దాటినా యూరియా అందడంలేదని,పంట ఎదుగుదలపై తీవ్ర ప్రభావం ఉంటుందని వంద మంది రైతులు వాపోతున్నారు.

శనివారం ఉదయం నర్సింహులపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు వ్యవసాయం పనులు మానేసి వేకువ జామునుండే తిండి తిప్పలు మానేసి నిరీక్షిస్తున్నారు.
అసలు యూరియా వస్తుందా..? రాదా..? అని కూడా చెప్పే అధికారులు గానీ, సంబంధిత వ్యక్తులు గానీ ఎవరూ లేరని రైతన్నలు వాపోతున్నారు. ఒక్కరు తెచ్చుకున్న బువ్వను నలుగురు పంచుకొని ఆకుల్లో తింటున్నారు. నలుగురికి అన్నం పెట్టే అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు.

Leave a Reply