ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ చివరి లీగ్ మ్యాచ్ హై వోల్టేజ్ థ్రిల్లర్‌గా మారింది. లక్నో – ఆర్సీబీ మధ్య జరుగుతున్న ఈ ఉత్కంఠ పోరులో.. లక్నో జట్టు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. అయితే, బెంగళూరు బౌలర్లను ఉతికారేసిన లక్నో… నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 భారీ పరుగులు దంచేసింది.
పంతం పట్టి విరుచుకుపడ్డ పంత్ !
లక్నో కెప్టెన్ రిషబ్ పంత్.. ఈ సీజన్‌లో పెద్దగా రాణించకపోయినా, చివరి మ్యాచ్‌లో మాత్రం భారీ పునరాగమనం చేశాడు. ఓపెనర్ మిచెల్ మార్ష్ తో కలిసి పంత్ పరుగుల వర్షం కురిపించాడు.
దూకుడైన ఆటతో ఆకట్టుకున్న మిచెల్ మార్ష్.. (37 బంతుల్లో 67) అర్ధశతకంతో వెనుదిరిగాడు. ఇక పంత్ మాత్రం తన సత్తా చాటుతూ 54 బంతుల్లో సెంచరీ (100 పరుగులు) బాది ఆకర్షణీయ ప్రదర్శన ఇచ్చాడు. మొత్తం 61 బంతులు ఎదుర్కున్న పంత్ 118 పరుగులు బాది నానౌట్ గా నిలిచాడు.
152 పరుగుల భాగస్వామ్యం – మ్యాచ్ టర్నింగ్ పాయింట్
పంత్ – మార్ష్ జోడీ ఆర్సీబీ బౌలర్లను చితక్కొట్టింది. వీరిద్దరూ కలిసి 78 బంతుల్లో 152 పరుగుల అద్భుత భాగస్వామ్యం నమోదు చేశారు. ఇది లక్నో ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచింది. రెండో వికెట్‌కు వచ్చిన ఈ జోడీ భారీ షాట్లతో స్కోర్‌బోర్డును వేగంగా ముందుకు నడిపింది.
ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో లక్నో జట్టు భారీగా 227 పరుగులు సాధించింది. బౌలింగ్ విభాగంలో ఆర్సీబీ తరఫున నువాన్ తుషార, భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపర్డ్ ఒక్కో వికెట్ తీసారు. ఇప్పుడు క్వాలిఫయర్ 1లోకి ప్రవేశించాలన్న లక్ష్యంతో ఆర్సీబీ 228 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగనుంది.