Khanapur | ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు చేసుకోవాలి

Khanapur | ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు చేసుకోవాలి
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్
Khanapur | కడెం, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2026 ద్వారా 2026 – 27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Khanapur MLA Vedma Bojju Patel) అన్నారు. గురువారం కడెం మండలంలోని నాచన్ ఎల్లాపూర్ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్ శకుంతలతో కలిసి గురుకుల ప్రవేశ పరీక్ష పోస్టర్లను ఖానాపూర్ ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ రెసిడెన్షియల్ సంస్థల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో (Gurukul schools) ప్రవేశాలు కల్పించబడతాయని, రుక్మాపూర్ సైనిక్ స్కూల్, మల్కాజ్ గిరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్లలో ప్రవేశాలు, రాష్ట్ర స్థాయి మెరిట్ ఆధారంగా పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. ప్రవేశ పరీక్ష వచ్చే సంవత్సరం ఫిబ్రవరి, 22న (ఆదివారం), ఉదయం 11.00 గంటల నుంచి ఆయన మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిర్వహిస్తారని ఆయన తెలిపారు.
ఆన్ లైన్ దరఖాస్తులు (Online applications) 21 జనవరి 26లోపు చేసుకోవాలని సూచించారు. ఈ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫార్ములు, క్రీడా సామాగ్రితో పాటు ఐఐటీ, నీట్, సీయూ ఈటీ వంటి జాతీయ స్థాయి పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించబడుతుందని తెలిపారు. దరఖాస్తులు పూర్తిగా ఆన్ లైన్ విధానంలో స్వీకరించబడతాయని, అర్హత కలిగిన విద్యార్థుల తల్లిదండ్రులు అధికారిక వెబ్ సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
ప్రవేశాలు మెరిట్, రిజర్వేషన్ (Merit, Reservation) నిబంధనల ప్రకారం ఇవ్వబడతాయని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాచన్ ఎల్లాపూర్ తెలంగాణ ప్రభుత్వం సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్ శకుంతల, తదితరులు పాల్గొన్నారు.
