కనకదుర్గమ్మకు పుష్పార్చన వైభవం…

కనకదుర్గమ్మకు పుష్పార్చన వైభవం…
ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక సుగంధ విరాజితం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : వసంత నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో ఆరో రోజు పుష్పార్చన అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఆలయ ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడగా, వేలాది మంది భక్తులు అమ్మవారి దివ్య దర్శనం కోసం తరలివచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన కాగడ మల్లెలు, మరువం, జాజులు, చామంతి వంటి సుగంధభరిత పుష్పాలతో ప్రత్యేకంగా అద్భుత అలంకరణ చేపట్టారు. రంగురంగుల పూలతో రూపొందించిన ఈ పుష్పాలంకరణ దర్శనార్థులకు కనులపండువగా నిలిచింది.
పుష్పార్చన సమయంలో ఆలయ పరిసరాలు పూల పరిమళాలతో నిండిపోగా, ఆ వాతావరణం భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మికానుభూతిని కలిగించింది. ఈ సుగంధభరిత అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా భక్తుల మనస్సుకు ప్రశాంతత లభించిందని వారు తెలిపారు. భక్తుల భారీ రద్దీ మధ్య కూడా ఆలయ నిర్వాహకులు సక్రమంగా ఏర్పాట్లు చేపట్టి దర్శనాన్ని సజావుగా నిర్వహించారు. ఈ పుష్పాలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు భక్తులకు సుఖసంతోషాలు, ఐశ్వర్యం ప్రసాదిస్తారని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ పుష్పార్చన కార్యక్రమంలో దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




