india vs newzealand | నేడు టీ20 ప్రపంచకప్ ఫైనల్

india vs newzealand | నేడు టీ20 ప్రపంచకప్ ఫైనల్
భారత్, న్యూజిలాండ్ అమీతుమీ
టీమిండియా గెలవాలని హోమాలు
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో..
రాత్రి 7గంటలకు మ్యాచ్
వీక్షించేందుకు సిద్ధమవుతున్న అభిమానులు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : టీ20 ప్రపంచకప్ 2026 విజేత ఎవరో నేడు తేలనుంది. ఈ మహా సమరంలో భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్లు ఢీకొనబోతున్నాయి. ఈ కీలక పోరు కోసం దేశమంతటా ఎదురుచూస్తోంది. ఆదివారం కావడంతో రాత్రి 7గంటలకు టీవీలకు అతుక్కుపోవడానికి ప్రజలు కూడా సిద్ధమయ్యారు. ఈ అద్భుతమైన ఫైనల్ మ్యాచ్‌ను చూడటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఈ ఫైనల్లో గెలిచి ఎలాగైనా కప్ గెలవాలని కోట్లాది మంది భారతీయులు కోరుకుంటున్నారు. కొందరు భారత్ విజయం సాధించాలని ఆలయాలల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పూజారులు భారత జట్టు క్రికెటర్స్ పేర్లతో హోమాలు నిర్వహించి టీమ్ ఇండియాకు దైవశక్తి సమకూరేలా చేశారు.

భారత జట్టు విశ్వవిజేతగా నిలవాలని కోరుకుంటూ దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అయోధ్యలోని సాధువులు భారత ఆటగాళ్ల పోస్టర్లు, జాతీయ జెండాతో ప్రత్యేక హోమాలు నిర్వహించి మంత్రోచ్ఛారణలు చేశారు. వారణాసిలోని గంగా ఘాట్ వద్ద ప్రజలు హారతులు ఇచ్చి టీమ్ఇండియా గెలవాలని పూజలు చేశారు. ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయంలో కూడా భారత్ విజయం సాధించాలని భక్తులు పూజలు నిర్వహించారు. కాన్పూర్ వంటి నగరాల్లో కూడా పూజలు చేస్తూ తమ జట్టుకు మద్దతు తెలుపుతున్నారు.
మరోవైపు శ్రీ రాజ్యశ్యామల పీఠం జ్యోతిష్యులు దేవగిరి సంతోష్ శర్మ , శ్యామ్ శర్మ ఆధ్వర్యంలో హోమాలు, జపాలు నిర్వహించారు. కొడకండ్ల లోనీ ప్రముఖ దేవస్థానమైన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో అభిమానులు, భక్తులు పెద్ద ఎత్తున దేవి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో భారత్ గెలవాలని యజ్ఞాలు, పూజలు చేశారు. భారత్ విశ్వ విజేతగా నిలవాలని దేశమంతా ఎదురుచూస్తుంది.
