forgery | గర్భిణీ స్త్రీలకు పొంచి ఉన్న ప్రమాదం..

forgery | గర్భిణీ స్త్రీలకు పొంచి ఉన్న ప్రమాదం..

forgery | మాతృత్వంలో ఆహారంపై జాగ్రత్త ఎందుకు అవసరం?
మార్కెట్లో కల్తీ పేస్ట్‌ల ప్రమాదకర వాస్తవం
వరుస దాడులతో బయటపడుతున్న షాకింగ్ ఘటనలు
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం – నిపుణుల హెచ్చరికలు
ఇంటి తయారీనే సురక్షితమైన మార్గం

forgery | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మాతృత్వం అనేది ప్రతి మహిళ జీవితంలో ఒక తీయని అనుభూతి. అదే సమయంలో అది అత్యంత ఆందోళనకరమైన దశ కూడా. ముఖ్యంగా తొలిసారి గర్భధారణ అయితే, ఆ కాలం మరింత ఉద్వేగభరితంగా ఉంటుంది. డెలివరీ గురించి అనేక ఆలోచనలు, భయాలు సహజంగానే కలుగుతాయి.

గర్భం ధరించినప్పటి నుంచి మహిళలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. తినే ప్రతి ఆహార పదార్థం ఆరోగ్యకరమైన డెలివరీకి తోడ్పడేలా ఉండాలి. శరీరాన్ని ప్రసవానికి సిద్ధం చేయడంలో సరైన పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది.

forgery

ఆరోగ్యకరమైన సంతానాన్ని పొందాలంటే గర్భధారణ సమయంలో పౌష్ఠికాహారం తప్పనిసరి. అయితే ప్రస్తుతం మార్కెట్లో లభించే కొన్ని ఆహార పదార్థాల్లో కల్తీ ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇవి తల్లి ఆరోగ్యానికే కాకుండా గర్భంలో పెరుగుతున్న శిశువుపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా వంటల్లో రుచి కోసం విరివిగా వాడే అల్లం–వెల్లుల్లి పేస్ట్‌లో కల్తీ బయటపడుతున్న ఘటనలు నగరవాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. “పట్టిందంతా కల్తీ” అన్నట్టుగా వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ కేసులు ప్రజల్లో అనిశ్చితి పెంచుతున్నాయి. కొందరు వ్యాపారులు లాభాల కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది.

forgery

ఇటీవల వికారాబాద్ జిల్లా తాండూర్‌లో సుమారు 600 క్వింటాళ్ల కల్తీ అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఘటన మరువకముందే హైదరాబాద్ అత్తాపూర్‌లో మరోసారి దాడులు జరిపి దాదాపు 70 క్వింటాళ్ల పేస్ట్‌ను స్వాధీనం చేసుకుని యూనిట్‌ను సీజ్ చేశారు. ఈ వరుస ఘటనలు నగరాన్ని కుదిపేశాయి.

అయితే అక్కడితో ఆగలేదు. తాజాగా మైలర్ దేవ్‌పల్లి కాటేదాన్ ప్రాంతంలో మరో అక్రమ తయారీ కేంద్రం బయటపడింది. అపరిశుభ్ర వాతావరణంలో, హానికర రసాయనాలతో పేస్ట్ తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 22 లక్షల రూపాయల విలువైన సామాగ్రి, 4 క్వింటాళ్ల కల్తీ పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాణ్యతలేని అల్లం, పాడైపోయిన వెల్లుల్లి రెబ్బలు, మలినాలతో కలిపి తయారీ జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు.

forgery

ఇలాంటి కల్తీ పేస్ట్ వినియోగం ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు తక్షణమే కనిపిస్తాయని అంటున్నారు. హానికర రసాయనాల కారణంగా జీర్ణకోశ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, చర్మ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.

forgery

దీర్ఘకాలంగా ఇలాంటి పదార్థాలు వాడితే కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎక్కువగా ప్రభావితమవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కల్తీ పేస్ట్‌లో బ్యాక్టీరియా, ఫంగస్ ఉండే అవకాశం అధికం. ఇవి వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి సమస్యలకు కారణమవుతాయి. గర్భిణీలకు ఈ సమస్యలు వస్తే డీహైడ్రేషన్‌కు దారి తీసి, అది గర్భస్థ శిశువుపైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

forgery

ఇక కొన్ని తయారీదారులు పేస్ట్ నిల్వ ఉండేందుకు హానికర కెమికల్స్ ఉపయోగిస్తున్నారు. ఇవి శరీరంలోకి వెళ్లి విషప్రభావం చూపే ప్రమాదం ఉంది. కాలేయం, మూత్రపిండాల పనితీరును దెబ్బతీసే అవకాశం ఉండటంతో పాటు, గర్భస్థ శిశువు అభివృద్ధిపై కూడా ప్రభావం చూపవచ్చు.

అలాగే కల్తీ పదార్థాలు శరీరానికి సరిపోక అలర్జీలు, కడుపుమంట, గ్యాస్ వంటి సమస్యలు పెరుగుతాయి. ఇవి గర్భిణీలకు మరింత ఇబ్బందికరంగా మారుతాయి.ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. నమ్మకమైన ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి. అనుమానాస్పద పేస్ట్‌లను దూరంగా ఉంచి, సాధ్యమైనంతవరకు ఇంట్లోనే తాజా పదార్థాలతో తయారు చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply