ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్

ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్

జూలూరుపాడు, ఆంధ్రప్రభ : కస్తూర్బా గాంధీ విద్యాలయం, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మిక సందర్శించారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా జూలూరుపాడు గ్రామంలోని కేజీబీవి విద్యాలయం,జూనియర్ కళాశాలను సందర్శించారు.ఎనిమిదవ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు.బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోజువారీగా అందుతున్న టిఫిన్, భోజనం నాణ్యతపై ఆరా తీశారు.

ప్రభుత్వం నిరద్జేశించిన ప్రకారం ఆహారం అందుతున్నదా లేదా అని విద్యార్థినులను కలెక్టర్ అంకిత్ ప్రశ్నించి, విషయాన్ని నిర్ధారించుకున్నారు. బాలికలతో ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాన్ని చదివించి పఠన సామర్థ్యాన్ని పరీక్షించారు. పూర్తైన సిలబస్ వివరాలు తెలుసుకున్నారు. డైనింగ్ హాల్,కిచెన్‌ను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. కేజీబీవి విద్యాలయంలో మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.

బీట్‌రూట్ వంటి కూరగాయలు అందించకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించారు.బాలికలకు తప్పనిసరిగా నాణ్యమైన,తాజా కూరగాయలతో ఆహారం అందించాలని ఆదేశించారు. చేతులు శుభ్రపరచుకునే ప్రదేశంలో ట్యాపులు లేకపోవడం, మరమ్మతులు చేపట్టకపోవడంపై వివరణ కోరారు. గ్యాస్ సదుపాయం,సిలిండర్ల లభ్యత, వంట సిబ్బంది సంఖ్య,నెలవారీ ఖర్చుల వ్యయాలపై వివరాలను నిర్వాహకులను అడిగారు.

నిరుపయోగంగా ఉన్న ఆర్ఓ ప్లాంట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరమ్మతులు చేయించకుండా బయట నుంచి తాగునీటిని సరఫరా ఎందుకు కొనసాగిస్తున్నారన్నారు. అనవసర ఖర్చులను తగ్గించి నిర్వహణ నిధులను విద్యార్థుల సౌకర్యాల కోసం వినియోగించాలని కోరారు. వారం రోజుల్లో ఆర్వో ప్లాంట్‌ను మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు.

పాఠశాలలో సరుకుల సరఫరా విధానం, ఏఎన్ఎం అందుబాటు,రాత్రి సమయంలో డ్యూటీ సిబ్బంది, డ్యూటీ షెడ్యూల్,విద్యార్థుల టైమ్ టేబుల్‌ తో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోని వివరాలను పరిశీలించారు. అనంతరం పడమట నర్సాపురం గ్రామంలోని గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు.తరగతి గదులను పరిశీలించి ఏడవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, ఆహార నాణ్యతపై ఆరా తీశారు. పాఠశాలలో మొత్తం 450 మంది విద్యార్థులు ఉన్నట్లు ప్రధానోపాధ్యాయులు సుభద్ర తెలిపారు. భోజనశాల, కిచెన్ షెడ్‌, విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న ఆహారాన్ని రుచి చూశారు.

స్టోర్ రూమ్‌లో నిల్వ ఉంచిన కూరగాయలను పరిశీలించి,కుళ్లిన కూరగాయలను వెంటనే తొలగించాలని,భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని సుభద్రను అంకిత్ ఆదేశించారు. వంటకు నాణ్యమైన,తాజా కూరగాయలనే వినియోగించాలని స్పష్టం చేశారు. స్టోర్ రూమ్‌లో నిల్వ ఉన్న బియ్యం, సరుకులను పరిశీలించారు. ఆర్ఓ ప్లాంట్‌ను పరిశీలించి తాగునీటి సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు.

సిబ్బంది హాజరు రిజిస్టర్,స్టాక్ రిజిస్టర్‌లను తనిఖీ చేశారు.విద్యార్థులకు యూనిఫార్ములు,నైట్ డ్రెస్సులు, స్పోర్ట్స్ డ్రెస్సులు సమయానికి అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ యంత్రాలు వినియోగంలో ఉన్నాయా లేవా అని ప్రశ్నించారు.బయో మెట్రిక్ పరికరాలను వెంటనే మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని,అవసరం లేకపోతే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పోషకాహారం తప్పనిసరిగా అందించాలని,పాఠశాలల్లో శుభ్రమైన త్రాగునీరు,పరిశుభ్రతపై ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించరదన్నారు.బాలికలకు నాణ్యమైన విద్యా బోధనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్,ఎంపిడిఓ తాళ్లూరి రవి,ఎంఇఓ జూంకిలాల్,ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సుభద్ర, కస్తూర్బా విద్యాలయం ప్రధానోపాధ్యాయులు పద్మజా, అర్ఐ చీమల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply