Finishing | మార్చి నాటికి లక్ష గృహప్రవేశాలు లక్ష్యం

Finishing | మార్చి నాటికి లక్ష గృహప్రవేశాలు లక్ష్యం
Finishing | చిట్యాల, ఆంధ్రప్రభ : మార్చి చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష గృహప్రవేశాల లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రెటరీ వి.పి గౌతమ్ అన్నారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, పెదకాపర్తి గ్రామంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తో కలిసి నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాలను తనిఖీ చేశారు.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి గృహాలను పరిశీలిస్తూ లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు.
ఇప్పటివరకు బ్యాంకులో ఎంత జమ అయిందని? ఇంటి నిర్మాణ అంచనాలు? అలాగే ఇప్పటి వరకైన ఖర్చు? తదితర వివరాలను లబ్ధిదారుల నుండి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లన్నీ ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం కంటే ఎక్కువ నిధులు ఖర్చుపెట్టి నిర్మించుకుంటుండడాన్ని గుర్తించిన సెక్రటరీ మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన 5 లక్షలలోపే ఇల్లు నిర్మించు కోవాలని, అప్పు చేసి ఎక్కువ మొత్తం ఖర్చు చేసి గృహాలు నిర్మించుకోవద్దని సూచించారు.

ఈ విషయంపై ఇందిరమ్మ కమిటీలు గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, స్థానిక మేస్త్రీల ద్వారా సాధ్యమైనంతవరకు నిర్మాణ ఖర్చు తగ్గించి ఇల్లు నిర్మించి ఇచ్చేలా చూడాలని చెప్పారు.మరోసారి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలతో సమావేశం నిర్వహించి లబ్ధిదారులందరికీ అవగాహన కల్పించాలని స్థానిక సర్పంచ్ వీరన్నకు సూచించారు.

ఇందిరమ్మ గృహ నిర్మాణం మొత్తం తో పాటు, ఉపాధి హామీ కింద మంజూరు చేసే బిల్లు, అలాగే మరుగుదొడ్లకు మంజూరైన ఇండ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్లాబ్, రూప్ స్థాయికి వచ్చిన వెంటనే వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మానికై బుక్ చేయించాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కు, గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్ కు సూచించారు. జిల్లాలో ఫినిషింగ్ స్టేజీలో ఎన్ని ఇండ్లు ఉన్నాయని? ప్రశ్నించగా, 6300 ఇండ్లు ఉన్నాయని గృహ నిర్మాణ పీడీ సెక్రటరీకి వివరించగా, మార్చి చివరినాటికి 6300 ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో మార్చినాటికి లక్ష గృహ ప్రవేశాల లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు.

అనంతరం ఎస్ సి కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇంకా నిర్మాణం మెదలు పెట్టని లబ్ధిదారుల తో ఆయన మాట్లాడారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మహిళా సంఘాల ద్వారా ముందుగా లక్ష రూపాయల రుణం మంజూరు చేయించాలని, ఇంకా ఇండ్లు ప్రారంభించని లబ్ధిదారులు వెంటనే ఇండ్లు ప్రారంభించాలని సూచించారు. లబ్ధిదారులు మంత్రి స్వప్న, సంతోష ,కళమ్మ ,మాధవి తదితరుల ఇండ్లకు వెళ్లి ఇంటి నిర్మాణాలను చూస్తూ వారితో ముఖాముఖి మాట్లాడారు. అలాగే ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులు ప్రమీల, చోల్లేటి సత్యనారాయణ లతో కూడా మాట్లాడారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని, ఎక్కువ కొలతలతో ఇంటి నిర్మాణం చేపట్టినట్లయితే ఖర్చు ఎక్కువ అవుతుందని, దానివల్ల ఇబ్బందులు ఏర్పడతాయని తెలిపారు .ఈ విషయంపై గ్రామంలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయలక్ష్మి, ఏఈ ప్రీతి, సర్పంచ్ కాటం వెంకటేశం, తదితరులు ఉన్నారు.
click here to read more : Supreme Court | పునర్ నిర్మాణం సాధ్యం కాదు..
