ఉత్సవ వైభవం, ప్రజా ఉల్లాసం…

  • ఆంధ్రప్రదేశ్ లో కొత్త పంథా.
  • విజయవాడ ఉత్సవ్‌తో సంస్కృతి పునరుజ్జీవం
  • ఇది సంస్కృతి, సంక్షేమం, అభివృద్ధి కలయిక
  • గొల్లపూడి వేదికపై సీఎం చంద్రబాబు

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : విజయవాడ(Vijayawada) ఉత్సవ్, అమరావతికి మణిహారంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chief Minister Nara Chandrababu Naidu) అన్నారు. దసరా సంబరాల్లో భాగంగా గురువారం విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ఎక్స్‌పో గ్రౌండ్స్‌(Expo Grounds)ను సీఎం సందర్శించారు.

ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబో వంటశాలను పరిశీలించిన సీఎం, ఏఐ సహకారంతో వండిన చిల్లీ పన్నీర్ వంటకంను రుచి చూసి బాగుందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలించిన ఆయన, ఆర్గానిక్ వ్యవసాయం పై మరింత దృష్టి సారించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.

విజయవాడ గొల్లపూడి ఎక్స్‌పో గ్రౌండ్స్‌లో దసరా(Dussehra సంబరాల్లో భాగంగా జరిగిన విజయవాడ ఉత్సవ్ 11 రోజులపాటు అద్భుతంగా నిర్వహించిన ఉత్సవాన్ని విజయవంతం చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ నిర్వాహక బృందాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు.

ఏడాదిన్నర కిందటి వరకు రాష్ట్ర ప్రజల ముఖాల్లో ఆనందం కనిపించలేదని, ఆ సమయంలో భయం, దాడులు, ఆవేదనే రాజ్యమేలాయని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాతే ప్రజల ముఖాల్లో స్వేచ్ఛా వాతావరణం, సంతోషం తిరిగి కనిపించిందని తెలిపారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan), బీజేపీతో కలిసి మంచి పరిపాలన అందిస్తామన్న హామీపై విశ్వాసం ఉంచి ప్రజలు కూటమికి రికార్డు స్థాయి విజయాన్ని అందించారని అన్నారు.

మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రజలు ఆనందంగా వినియోగిస్తున్నారని, విజయవాడ దుర్గమ్మ దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సూపర్ సిక్స్(Super Six) విజయాన్ని ప్రజలే సాధించారని పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా గత పాలకులు ప్రజలతో అన్యాయం చేశారని సీఎం చంద్రబాబు విమర్శించారు. దుర్గమ్మ(Durgamma) ఆశీస్సులు, కృష్ణమ్మ కరుణతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది” అని విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణాన్ని తిరిగి ట్రాక్‌లో పెట్టామని, “మూడేళ్లలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు తిరిగి ఇక్కడే స్థిరపడతారు” అని చెప్పారు.

ఎన్టీఆర్, అక్కినేని, ఘంటశాల లాంటి మహానుభావులు ఈ ప్రాంతం నుంచే వెలసారని చంద్రబాబు గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజలకు మానసిక ఆనందం కూడా అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు. కనుమరుగవుతున్న కళలను కాపాడుకోవడం అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు.

11 రోజులపాటు జరిగిన ఉత్సవంలో 280కిపైగా ఈవెంట్లు నిర్వహించగా, దాదాపు 2.50 లక్షల మంది వీక్షించారని సీఎం చంద్రబాబు తెలిపారు. హెలీ రైడింగ్(Riding), సాహస క్రీడలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయని, రోబోటిక్ కిచెన్ ద్వారా విజయవాడ పారిశ్రామికవేత్తల ప్రతిభను ప్రదర్శించారని ఆయన అభినందించారు. మహాత్మా గాంధీ రోడ్డుపై నిర్వహించిన సాంస్కృతిక కవాతు, డప్పు కళాకారుల గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. గరగలు, కొమ్ముకోయ, తప్పెటగుళ్లు, కర్రసాము, బుట్టబొమ్మలు(Dolls), భేతాళసెట్టు, నాసిక్ డోల్ వంటి ప్రజా కళారూపాలు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించాయని ఆయన అన్నారు.

పర్యాటక రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దేవాలయాలు 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను ఆకర్షించే శక్తి కలిగివున్నాయని చంద్రబాబు వివరించారు. అన్నవరం, శ్రీకూర్మం, సింహాచలం(Simhachalam), వాడపల్లి, ద్వారకాతిరుమల, దుర్గగుడి, పానకాల లక్ష్మీనరసింహస్వామి, పెంచలకోన, తిరుమల, కాణిపాకం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, మహానంది వంటి పుణ్యక్షేత్రాలు మన సంపద, వారసత్వమని ఆయన పేర్కొన్నారు.

విజయవాడ ఉత్సవ్ విజయవంతం కావడం ప్రజల ఐక్యతకు, సంస్కృతిపై మమకారానికి, అభివృద్ధిపై విశ్వాసానికి ప్రతీకగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Leave a Reply