Exams | సజావుగా పదో తరగతి పరీక్షలు..

Exams | సజావుగా పదో తరగతి పరీక్షలు..
పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
Exams | విజయవాడ, ఆంధ్రప్రభ : జిల్లాలో పదో తరగతి తొలిరోజు పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిన ఏర్పాట్లు ఆహ్లాదకర వాతావరణంలో పరీక్ష రాసేందుకు దోహదం చేశాయి. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ గవర్నర్‌పేట సీవీఆర్ మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్ పరీక్షా కేంద్రాన్ని డీఈవో ఎల్.చంద్రకళతో కలిసి తనిఖీ చేశారు. సీటింగ్ అరేంజ్‌మెంట్, తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, వైద్య శిబిరం వంటి సౌకర్యాలను పరిశీలించారు.
పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మీడియాతో మాట్లాడుతూ మొత్తం 27,360 మంది విద్యార్థులకు 149 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు సజావుగా పరీక్షలు రాసేందుకు సౌకర్యాలు కల్పించామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు హాల్ టిక్కెట్ చూపించి ఆర్‌టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందేలా చూస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో అమలుచేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా ఈసారి పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. డీఈవో ఎల్.చంద్రకళ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి పరీక్షా కేంద్రంలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. పరీక్షలు సజావుగా జరిగేలా కేంద్రాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణతో పాటు అవసరమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేసినట్లు డీఈవో చంద్రకళ వెల్లడించారు.
