హైదరాబాద్, ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజోలు మండలం పెద్ద ధన్వాడలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేపట్టారు. గుట్టుచప్పుడు కాకుండా పనులు ప్రారంభించేందుకు కంపెనీ యత్నించడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. ఈ క్రమంలో పలు గ్రామాలకు చెందిన రైతులు ఫ్యాక్టరీ వ్యతిరేక ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ పనులను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గాయత్రి ఇథనాల్ కంపెనీకి చెందిన కార్లు, టెంట్లను రైతులు ధ్వంసం చేశారు. పరిశ్రమకు చెందిన టెంట్లు, కంటైనర్ డబ్బాలకు రైతులు నిప్పుపెట్టారు.
పనుల్లో ఉన్న వర్కర్స్‌ని తరిమికొట్టిన రైతులు…
కంపెనీ నిర్మాణ పనులు చేయిస్తున్న కూలీలను రైతులు తరిమికొట్టారు. ఆందోళన చేస్తున్న రైతులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. రైతులు ఆందోళన చేపట్టనున్నారన్న సమాచారం ముందస్తుగా పోలీసులు సంఘటనా స్థలం పోలీసులు మోహరించినా.. రైతులు భారీ సంఖ్యలో ఉండడంతో వారిని పోలీసులు నిలువరించలేకపోయారు. కంపెనీకి చెందిన స్థలంలో ఉన్న వాహనాలను సైతం రైతులు ధ్వంసం చేశారు. మూడు నెలల కిందట కంపెనీ ఉండదని చెప్పిన యాజమాన్యం.. మళ్లీ పనులు మొదలుపెట్టేందుకు ఉపక్రమించడంతో పది గ్రామాల రైతుల ఆందోళన చేపట్టారు.
విషయం చిమ్మే ఫ్యాక్టరీలు..
ఆరునెలలుగా 12 గ్రామాల ప్రజలైన క్యాన్సర్ కారకాలు, విషాన్ని చిమ్మే పెట్టే ఫ్యాక్టరీని నిర్మించొద్దంటూ నిరసన నిరహార దీక్షలు కొనసాగించినట్లు పేర్కొంది. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అలంపూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి సంపత్ కుమార్ హామీతో దీక్షలు విరమించామని గుర్తు చేసింది. అర్ధరాత్రి దొంగ దెబ్బ తీస్తారని ఊహించలేదని పేర్కొంది. ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి, శాంతియుతంగా పోరాడుతున్న సమయంలో ప్రజలపై దాడి చేసేందుకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దురుద్దేశంతో ప్రైవేట్ సైన్యాన్ని మోహరిస్తూ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏం కోరుకుంటుందని.. ప్రజల సహనాన్ని పరీక్షించడం దేనికి సంకేతమని ప్రశ్నించింది.
