మానవత్వం చాటుకున్న చిన్నారులు

మానవత్వం చాటుకున్న చిన్నారులు

పసి ప్రాణాల కోసం విద్యార్థుల చొరవ
అరుదైన వ్యాధితో బాధపడుతున్న తోటి పిల్లల కోసం చందాల సేకరణ
రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన బూదకలాన్ విద్యార్థులు

బెల్లంపల్లి,ఆంధ్రప్రభ : అరుదైన వ్యాధితో ప్రాణాల కోసం పోరాడుతున్న ఇద్దరు చిన్నారులను ఆదుకునేందుకు బెల్లంపల్లి మండలంలోని బూదకలాన్ గ్రామానికి చెందిన విద్యార్థులు మానవత్వం చాటుకున్నారు. తమ వయస్సుకంటే పెద్ద మనసు చూపుతూ ఇంటింటికీ తిరిగి చందాలు సేకరించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.

బెల్లంపల్లి పట్టణంలోని టేకులబస్తీకి చెందిన దేవిని కృష్ణవేణి–కళ్యాణ్ దాస్ దంపతుల పిల్లలు శివ సహస్ర (7), మహావీర్ (4) అరుదైన వెన్నుపూస వ్యాధి అయిన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్‌ఎంఏ) తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి చికిత్సకు భారీ ఖర్చు అవసరమని వైద్యులు తెలపడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది.

చిన్నారుల చికిత్స కోసం సుమారు రూ.32 కోట్ల వ్యయం అవుతుందని తెలియడంతో, వారిని ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బెల్లంపల్లి మండలంలోని బూదకలాన్ గ్రామానికి చెందిన కొందరు విద్యార్థులు స్పందించి తమ వంతు సహాయం అందించాలనే సంకల్పంతో ముందుకు వచ్చారు.

బాధిత చిన్నారుల ఫోటోలు ఉన్న బ్యానర్‌ను పట్టుకుని బెల్లంపల్లి పట్టణంతో పాటు పలు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ చందాలు సేకరించారు. ప్రజలు కూడా వారి ప్రయత్నాన్ని అభినందిస్తూ తమ వంతు విరాళాలు అందజేశారు. విద్యార్థులు సేకరించిన రూ.10 వేల నగదును బాధిత చిన్నారుల తల్లిదండ్రులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, అనిల్ కుమార్, అంకిత్, అనిల్, అశ్విత్, జస్వంత్, రాకేష్, విష్ణు, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. పసి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో చిన్నారులు చూపిన ఈ మానవత్వాన్ని గ్రామస్థులు, పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. బాధిత చిన్నారుల చికిత్సకు దాతలు మరింతగా ముందుకు వచ్చి సహాయం చేయాలని వారు కోరుతున్నారు.

Leave a Reply