Devotional | ముగ్గురమ్మల సేవలో మాజీ మంత్రి దేవినేని

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని కాచవరం (దొనబండ) గ్రామంలో శ్రీశ్రీశ్రీ కాళెమ్మ – సత్తెమ్మ – మారెమ్మ (ముగ్గురమ్మలు) అమ్మవార్ల జాతర మహోత్సవం బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు, పూజలు, హోమాలు చేశారు. గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాజరై ప్రత్యేక పూజలు చేసి జాతర మహోత్సవంలో పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధి, గ్రామ సంక్షేమం కోసం అమ్మవారి ఆశీస్సులు కోరుతూ భక్తులతో మమేకమయ్యారు. ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని అమ్మవార్లను కోరినట్లు తెలిపారు. మహోత్సవంలో భాగంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వందలాది మంది భక్తులు ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రత్యేక జాతర మహోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా గ్రామం సందడిగా మారింది.
