రామగుండంలో అభివృద్ధి పనులకు వేగం పెంచాలి – కలెక్టర్ కోయ శ్రీహర్ష

- నెల రోజుల్లో గర్ల్స్ హై స్కూల్ అభివృద్ధి పూర్తి చేయాలి..
- సమ్మక్క–సారలమ్మ గద్దెల పనులు త్వరగా పూర్తి చేయాలి….
గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా వేగంగా పూర్తి చేయాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు.
గురువారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించి, వివిధ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరిఖని సమ్మక్క–సారలమ్మ గద్దెలు, స్మశాన వాటిక, అశోక్‌నగర్ గర్ల్స్ హై స్కూల్, గౌతమ్‌నగర్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పనులు, రామగుండం చౌరస్తా వద్ద జరుగుతున్న ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. మున్సిపల్ అధికారులు సింగరేణి సంస్థతో నిరంతర సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
గోదావరిఖని నది ఒడ్డున ఉన్న స్మశాన వాటిక అభివృద్ధికి సంబంధించి సమగ్ర ప్రణాళికతో డీపీఆర్ (వివరమైన ప్రాజెక్టు నివేదిక) తయారు చేయాలని కలెక్టర్ సూచించారు.
అశోక్‌నగర్‌లోని గర్ల్స్ హై స్కూల్ అభివృద్ధికి ప్రభుత్వం రూ. కోటి నిధులు మంజూరు చేసిందని, ఆమోదించిన డిజైన్ ప్రకారం నెల రోజులలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
అలాగే గౌతమ్‌నగర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పనుల వేగాన్ని పెంచాలని, రామగుండం చౌరస్తా వద్ద చేపట్టిన ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణ పనులు ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్, గురు వీర, ఈఈ రామన్, ఆర్ అండ్ బి శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
