MDK | బీసీ అంశాన్ని దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్, బీజేపీ నాటకాలు… ఎమ్మెల్సీ కవిత
గజ్వేల్, ఫిబ్రవరి 17 (ఆంద్రప్రభ) : బీసీ అంశాన్ని దృష్టి మరల్చడానికి కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని శాసనమండలి సభ్యురాలు కవిత ఆరోపించారు. సోమవారం గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్ మండలం ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన సుదర్శన యాగం, ఆయుష్ హోమంలో కవిత పాల్గొని విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కుల సర్వేలో బీసీల తప్పుడు లెక్కల చర్చను పక్కదోవ పట్టించడానికి మోడీ బీసీనా, కాదా అన్న చర్చకు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని, దాంతో రాహుల్ గాంధీది ఏ మతమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారన్నారు. వీళ్లు వాళ్లను, వాళ్లు వీళ్లను తిడుతూ వాళ్లిద్దరు ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. మోదీ బీసీ అయితేంది కాకపోతేంది ? రాహుల్ గాంధీ ఏ మతమైతే మాకేందీ బీసీల జనాభాను సరిగ్గా లెక్కబెట్టాలన్నదే మా డిమాండ్ అన్నారు. కాంగ్రెస్ అసెంబ్లీలో బిల్లు పెట్టాలి… బీజేపీ కేంద్రంలో దాన్ని ఆమోదించాలని, ఇవి చేయకుండా మోదీ, రాహుల్ కులమతాల గురించి ప్రజలకు ఎందుకు అని ప్రశ్నించారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రజలను అవమానిస్తున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ చాలా రాజకీయ కుట్రలు చూసింది… ఆ రెండు పార్టీల కుట్రలు ఇక్కడ నడవయన్నారు. బీసీ బిడ్డలను మోసం చేయవద్దని కాంగ్రెస్, బీజేపీ పార్టీలను హెచ్చరిస్తున్నానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వంకర టింకర మాటలు మాట్లాడి ప్రజలను ఆగం చేస్తున్నారని, ఏ ఒక్క అంశానికి, సమస్యకు ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి పరిష్కారం చూపలేదన్నారు.
తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ ను తలవని గుండెలేదని, ప్రతి ఒక్కరూ కేసీఆర్ జన్మదినం సందర్భంగా పూజలు చేస్తున్నారన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారు కాబట్టే కేసీఆర్ ను ప్రజలు ఆరాధిస్తున్నారన్నారు. అందరి ఆశీర్వాదంతో మరింత శక్తియుక్తులతో కేసీఆర్ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారన్నారు. 14 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నరకం చూపిస్తోందన్నారు.
