Collector|నడకదారిలో శ్రీశైలం వచ్చే భక్తుల సౌకర్యాలపై ఆరా…

Collector|నడకదారిలో శ్రీశైలం వచ్చే భక్తుల సౌకర్యాలపై ఆరా…
Collector|నంద్యాల బ్యూరో ,ఆంధ్రప్రభ: నంద్యాల జిల్లాలో జ్యోతిర్లింగాలలో ఒకటేనా శ్రీశైలం దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా మూడో రోజు జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలంలో భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీశైలంలోని కైలాస ద్వారం వద్ద ఉన్న నడకదారిని సందర్శించిన జిల్లా కలెక్టర్, పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటున్న భక్తులతో నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నడకదారిలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు భక్తులకు సరిపడుగా ఉన్నాయా, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే అంశాలపై భక్తుల అభిప్రాయాలు, సూచనలు సేకరించారు.
భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా నడకదారిలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుల నిర్వహణ, వైద్య సిబ్బంది అందుబాటు, అత్యవసర సేవల అమలు తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అలాగే టాయిలెట్ల శుభ్రత, శుద్ధమైన మంచినీటి సరఫరా, భోజన ఏర్పాట్లు, విశ్రాంతి కేంద్రాలు తదితర సౌకర్యాల అమలు పద్ధతులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పటిష్టంగా కొనసాగించాలని, చిన్న లోపం కూడా తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నడకదారిలో భక్తులు సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించి దర్శనానికి చేరుకునేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వచ్చే లక్షలాది భక్తులకు ఇబ్బందులు లేకుండా, ప్రశాంత వాతావరణంలో దర్శనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. పాదయాత్ర చేస్తున్న భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

