- భవిష్యత్‌కు బాటలు వేసేలా పర్యాటక శాఖను తీర్చిదిద్దాలి
- డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు తెలంగాణను వేదికగా మార్చాలి
- అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు పర్యాటక శాఖలో ప్రాధాన్యం
- ప్రతి పర్యాటక ప్రదేశంలో వసతులు మెరుగుపర్చాలి
- పర్యాటకంనై సరైన ప్రచారం కల్పించాలి
రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా ఎక్కడికక్కడ యువతకు ఉపాధి కల్పించే వనరుగా పర్యాటక శాఖ ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఘనమైన తెలంగాణ చరిత్రను వర్తమానానికి అనుసంధానిస్తూ.. భవిష్యత్‌కు బాటలు వేసేలా పర్యాటక శాఖను తీర్చిదిద్దాలని సూచించారు.
పర్యాటక శాఖ కార్యాచరణపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. పర్యాటకులను ఆకర్షించే వనరులు తెలంగాణలో ఉన్నప్పటికీ గతంలో సరైన ప్రణాళికలు అమలు చేయని కారణంగా ఆ రంగంలో ఆశించిన ప్రగతి కనిపించలేదని చెప్పారు.
పర్యాటక శాఖ పాలసీకి తుది రూపు ఇచ్చే సమయంలో అటవీ, ఐటీ, విద్యుత్, టీజీ ఐఐసీ, వైద్య, క్రీడల శాఖలతో సమన్వయం చేసుకోవాలని, ఒక శాఖ విధానాలు మరో శాఖ విధానాలకు ఆటంకంగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహాకాలు కల్పించాలన్నారు. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌లో బోట్ హౌస్ అందుబాటులో ఉంచాలన్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు తెలంగాణను వేదికగా మార్చాలని సూచించారు.
ఆలయాలు, పులుల అభయారణ్యాలకు పర్యాటకంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉందని గుర్తుచేస్తూ ఆ దిశగా దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
భద్రాచలం, సలేశ్వరం, రామప్ప వంటి ఆలయాలు, మల్లెల తీర్ధం, బొగత జలపాతాలు, బౌద్ధ స్తూపాలు, జైన ఆలయాలు ఇలా ప్రతి పర్యాటక ప్రదేశంలో వసతులు మెరుగుపర్చడంతో పాటు సరైన ప్రచారం కల్పించాలని సూచించారు.
భువనగిరి కోట రోప్ వే పనులపైనా సీఎం ఆరా తీశారు. భూ సేకరణలో కొంత జాప్యం జరిగిందని… ఇప్పుడు భూ సేకరణ పూర్తయినందున త్వరలో టెండర్లు పిలుస్తామని అధికారులు సీఎం గారికి వివరించారు. రోప్ వే పనులకు టెండర్లు పిలవడంతో పాటు కోటపై ఉన్న చారిత్రక కట్టడాల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు పర్యాటక శాఖలో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం అన్నారు. వైద్య అవసరాలకు విదేశాల నుంచి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యాటకుల్లా వచ్చిపోయేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యాటక శాఖకు బడ్జెట్ కేటాయింపులు పెరిగేలా చూస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.