ముడుచింతలపల్లిలో కనికట్టు…?

ముడుచింతలపల్లిలో కనికట్టు…?

ఆస్తి పన్నుల లెక్కలు తేలేనా…?
రూ.40 లక్షలు ఎటుపాయే…?
అధికారులు ఉన్నటా… లేనట్టా…
అధికారుల తీరు పై భగ్గుమంటున్న ప్రజలు
ప్రజల పరిస్థితి ఏంటి…?

మూడు చింతలపల్లి, ఆంధ్రప్రభ : మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో అసలేం జరుగుతోంది..? అధికారులు ఉన్నట్లా లేనట్టా…? ఆస్తి పన్నుల లెక్కల అవకతవకల విషయంలో స్పష్టత లేకుండా ఉండడానికి గలా కారణాలు ఏమై ఉంటాయనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. మూడు చింతలపల్లి గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు ఉన్న ఆస్తి పన్ను లెక్కలు ప్రస్తుత నూతన మున్సిపాలిటీగా ఏర్పడిన మూడు చింతలపల్లి ఆస్తి పన్నుల లెక్కలు ఎందుకు పొంతన కుదరడం లేదు అవకతవకలు ఎలా చోటు చేసుకున్నాయి.

ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్ధిక సంవత్సరం కాబట్టి లెక్కలు బయటకు వచ్చాయా ఇన్ని రోజులు ఆస్థి పన్నులు వసూలు చేస్తున్నప్పుడు తేడాను అధికారులు గుర్తించలేదా గుర్తించిన గుట్టుచప్పుడు కాకుండా ఉండేలా చేసుకున్నారా అనే ప్రశ్నలు ప్రజల మెదడులో సుడిగుండంలా తిరుగుతున్నాయి. పెద్ద మొత్తంలో రూ. 40 లక్షల వరకు ఆస్తి పన్ను లెక్కల్లో తేడా రావడం ఏంటని లెక్కలోనే ఇలా అవకతవకలు ఉంటే ఇక అభివృద్ధి ఏమి చేస్తారని పలువురు అంటున్నారు. ఆస్తి పన్ను అవకతవకల విషయంలో ఉన్నతాధికారులు నోరుమెదపక పోవడం పై ప్రజలు సర్వత్రా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆస్తి పన్నుల లెక్కలు తేలేనా…?

ప్రస్తుతం అధికారులు ఆర్ధిక సంవత్సరం సందర్బంగా ఆస్తి పన్నులు వసూలు చేయడం మొదలు పెట్టారు వారం రోజుల్లో ఆర్ధిక సంవత్సరం ముగియనుంది అప్పటిలోగా అధికారులు ఆస్తి పన్ను లెక్కలు తెలుస్తారా వివరాలు వెల్లడిస్తారా…? అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఒక వేళ లెక్కలు వెల్లడిస్తే ఏమని వెల్లడిస్తారు లెక్కలకు సంబంధించిన వివరాలు ఉన్నాయా అనే ఆలోచనలో ప్రజలు పడ్డారు.

మున్సిపల్ ఏర్పడి సంవత్సరం గడిచిందో లేదో ఇలా ఆస్తి పన్ను లెక్కల విషయంలో గందరగోళ పరిస్థితి ఉంటే ఇక నిధుల విషయంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చునని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రూ. 40 లక్షల లెక్కలు తేల్చడానికి అధికారులు కుస్తీపడుతున్నారు.. మున్సిపల్ కమీషనర్ ఆస్తి పన్నుల లెక్కల విషయంలో పలువురికి మెమోలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

రూ. 40 లక్షలు ఎటు పాయే…

ఒక వైపు మున్సిపల్ అధికారులు మా లెక్కల ప్రకారం మూడు చింతలపల్లి మున్సిపల్ డిమాండ్ రూ.3 కోట్ల 30 లక్షలు అని చెబుతున్నారు. మరో వైపు మూడు చింతలపల్లి మండలంగా ఉన్నప్పుడు రూ. 2 కోట్ల 38 లక్షలు మాత్రమే తమ డిమాండ్ అని పంచాయతీ శాఖ అధికారులు చెపుతున్నారు. ఇందులో ఏ లెక్క సరైనదో వారికే తెలియకపోవడం గమనార్హం. ఆస్తి పన్నులు వసూలు చేసి రాశీదులు ఇచ్చినప్పటికీ ఆన్ లైన్ లో నమోదు చేయకపోవడం గల ఆంతర్యం ఏమిటని అంటున్నారు.

ఆస్తి పన్ను కడితేనే కదా రాశీదులు ఇచ్చేది అధికారులు మరి అలాంటప్పుడు రూ. 40 లక్షలు తేడా ఎలా వస్తుంది ఎటు పోయాయి డబ్బులు కట్టింది ప్రభుత్వానికి కాదా..? అని ప్రజలు మండిపడుతున్నారు. ఆస్తి పన్ను లెక్కల్లో రూ. 40 లక్షలు లెక్కలోకి రాకపోతే 90 శాతం ఆస్తి పన్నులు వసూలు చేశామని అధికారులు ఎలా చెబుతున్నారు. రూ. 40 లక్షలు ఎటు పోయాయో అధికారులకు సంబంధం లేదా ఉంటే ఎందుకు నిమ్మకునిరెత్తనట్లు ఉంటున్నారు.

అధికారుల తీరు భిన్నం…

ఏమైనా విషయం గురించి ప్రజలు వివరాలు కొరకై కార్యాలయానికి వెళ్తే తమకు తెలియదంటే తమకు తెలియదని ఒకరి పై ఒకరు తోసిపుచ్చుకుంటున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆస్తి పన్ను విషయానికొస్తే ఆస్తి పన్ను కట్టి రాశీదులు ఉన్నా తిరిగి ఎలా కడతామని ఆన్ లైన్ లో నమోదు కాకపోతే తమ తప్పు ఎలా అవుతుందని అధికారుల తీరు పై ప్రజలు మండిపడుతున్నారు.

మరో విషయం ఏమిటంటే ప్రజలు ఆస్తి పన్నులు కడితేనేగా రాశీదులు ఇచ్చేది క్యాష్ ఇన్ హాండ్ గా చూపెట్టేదని దానిని లెక్కల్లో తీసుకున్నాక కూడా లెక్కల్లో తేడా రావడం ఏమిటని ఆ లెక్కలు సరైనవి కాదా మరి అని కొందరు గుసగుసలాడుతున్నారు. ఈ తతంగం లో 1300 వందల వాటికి జీరో పన్నుగా అధికారులు నమోదు చేశారని అందుకే లెక్కల్లో పొంతన కుదరడం లేదని రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు క్యాష్ ఇన్ హాండ్ గా వినియోగించారని బాహాటంగానే చెప్పడం మూడు చింతలపల్లి మున్సిపల్ లో తీవ్ర దుమారం రేపుతోంది.

ప్రజల పరిస్థితి ఏంటి…?

ఆస్థి పన్ను బకాయి లేకుండా ఆస్తి పన్ను చెల్లించినా కూడా ఆన్ లైన్ లో బకాయిలుగా చూపించడంతో ప్రజల పరిస్థితి అగోమ్యచారంగా మారింది. అధికారులను అడిగితే నమోదు అవుతాదని కొందరు లేదు ఇది చెల్లదని తిరిగి ఆస్తి పన్ను చెల్లించాలని మరి కొందరు చెప్తుండడంతో ప్రజలు సతమతమవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేది ఎవరు ఎప్పుడు అని దీనికి పరిష్కారం చూపే వరకు ఆస్తి పన్ను కట్టబోయేది లేదని ప్రజలు తెగేసి చెబుతున్నారు.

మరి ఆస్తి పన్నులు చెల్లించకపోతే మున్సిపాలిటీ పరిస్థితి ఏంటి నిర్వహణ ఎలా సాగుతుందో వేచి చూద్దాం.. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి లెక్కల విషయంలో విచారణ జరిపి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

అధికారుల వివరణ కోరగా…

ప్రొఫార్మ ప్రకారం వసూలు చేస్తాం…

అర్షద్, ఆర్ఐ, మూడు చింతలపల్లి మున్సిపాలిటీ

మున్సిపాలిటీ చట్ట ప్రకారం ఆస్తి పన్ను వసూలు చేసి జమ చేస్తాం. గతంతో మాకు ఎలాంటి సంబంధం లేదు రాశీదులు ఉండి చాలన్లు ఉంటే ఆన్ లైన్ లో నమోదు చేసి బకాయిలుగా ఉన్న వాటిని తొలగిస్తాం.

డిమాండ్ 3 కోట్ల 30 లక్షలు

పవన్ కుమార్, కమీషనర్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీ మూడు చింతలపల్లి మున్సిపాలిటీ ప్రకారం డిమాండ్ రూ. 3 కోట్ల 30 లక్షలు ఉంది. ఆస్తి పన్ను వివరాలను సేకరిస్తున్నాం ఆన్ లైన్ లో బకాయిలుగా చూపితే ప్రజలు ఆస్తి పన్ను చెల్లించాల్సిందే.

Leave a Reply