BRS | కేసీఆర్ చేసిన అప్పులు.. భవిష్యత్తు పెట్టుబడులు.. !

BRS | కేసీఆర్ చేసిన అప్పులు.. భవిష్యత్తు పెట్టుబడులు.. !
- ఖమ్మం సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- ఖమ్మం జిల్లా సర్పంచ్ ఉప సర్పంచ్ లకు ఘనంగా సత్కారం
BRS | ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆనాడు చేసిన అప్పులు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు పెట్టుబడులని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (Ramarao) పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల ఆత్మీయ సత్కార కార్యక్రమం ఈ రోజు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ అవును.. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆనాడు కేసీఆర్ అప్పులు చేశారని అంగీకరించారు. కేసీఆర్ చేసిన అప్పు మొత్తం రూ.2లక్షల 80 వేల కోట్లు అయితే.. సీఎం రేవంత్ రెడ్డి రూ.10 లక్షల కోట్లు అని అబద్ధాలు మాట్లాడుతున్నారని, మంత్రులు తలోరకంగా అబద్ధాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఆర్బిఐ), కేంద్ర ప్రభుత్వ సారధ్యంలోని కాగ్ చెప్పిన ప్రకారం కేసీఆర్ (Kcr) చేసిన అప్పు రెండు లక్షల 80 వేల కోట్లుగా స్పష్టం చేశారు. చేసిన అప్పుతో 11 సార్లు రైతుబంధు వేసి 73 వేల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని పేర్కొన్నారు. రైతు బీమా ఇచ్చి రైతు మరణిస్తే ఒక్కో రైతుకు రూ.5 లక్షలు చెల్లించారని ప్రస్తావించారు. రెండుసార్లు రైతు రుణమాఫీ చేసి 28 వేల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేశారని పేర్కొన్నారు. 15 లక్షల మంది ఆడకూతుళ్లకు కళ్యాణ లక్ష్మి పథకం అందజేశారని, 32 జిల్లాలు ఏర్పాటు చేసి కలెక్టరేట్లు, మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారని వివరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 30 వేల కోట్లు, ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టుకు 11,500 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు. ఇంకా పలు అభివృద్ధి అంశాలను ప్రస్తావించారు. రెండేళ్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప మరొకటి లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం గెలుపొందారని, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ (Congress) రెండు శాతం కూడా గెలువ లేదని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా రైతులకు ఒక్క యూరియా బస్తా ఇచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. పాలిచ్చే గేదని తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు చేసింది ఏమీ లేదని, ముగ్గురు మోసగాళ్లకు ఆలీబాబా గా రేవంత్ రెడ్డి పైన ఉండి నడిపిస్తున్నారని, 30 శాతం కమిషన్లతో దోచుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఓటమికి రాష్ట్రంలో రంగం సిద్ధమైందని, ఏ ఎన్నికలు జరిగినా టిఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందని పేర్కొన్నారు. అనంతరం సర్పంచ్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
