US Army: ఆర్మీలో ట్రాన్స్ జెండర్ల నియామకాలపై నిషేధం.. ట్రంప్ నిర్ణయం
వాషింగ్టన్ డీసీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మిలిటరీలో ట్రాన్స్‌జెండర్ల నియామకంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్‌జెండర్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా మిలిటరీ విభాగంలో ట్రాన్స్‌జెండర్‌ల నియామకాన్ని నిషేధించినట్లుగా అమెరికా సైన్యం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆర్మీ పేర్కొంది.
డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ట్రాన్స్‌జెండర్లు సాయుధ దళాల్లో చేరకుండా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అప్పటికే సైన్యంలో పనిచేస్తున్న వారిని మాత్రం కొనసాగించారు. తాజాగా మరోసారి లింగమార్పిడి వ్యక్తులను సైన్యంలో చేరకుండా నిషేధించింది. ఇక ట్రంప్ అధికారం చేపట్టిన రోజునే దేశంలో మేల్, ఫిమేల్ లు మాత్రమే ఉంటారని, ట్రాన్స్ జెండర్ అనేది ఉండదని, వారి గుర్తింపును రద్దు చేస్తున్నానని ప్రకటించారు.