కళారూపాలను పునరుద్ధరిస్తోన్న ఏఎస్బిఎల్

కళారూపాలను పునరుద్ధరిస్తోన్న ఏఎస్బిఎల్

హైదరాబాద్, అక్టోబర్ 18 (ఆంధ్రప్రభ) : భావితరపు జీవన ప్రాంగణాలను సృష్టించడంలో ప్రాచుర్యం పొందిన ఏఎస్బిఎల్ ఇప్పుడు నృత్యప్రియ డ్యాన్స్ అకాడమీతో భాగస్వామ్యం చేసుకుని భారతీయ కళారూపాలకు పునర్వైభవం కలిగించటానికి ప్రయత్నిస్తోంది. నృత్యప్రియ డ్యాన్స్ అకాడమీ 10వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా కింగ్ కోఠీ లోని భారతీయ విద్యా భవన్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలకు భాగస్వామిగా వ్యవహరించింది. శ్రీ కృష్ణుడు ఇతివృత్తంగా నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో కూచిపూడి నృత్య రూపంలో దశాబ్దపు శ్రేష్ఠతను స్మరించుకునేందుకు 500 మందికి పైగా విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, కళాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ వేడుకలలో భాగంగా అంబపరాకు, గణేశ పంచరత్నం, జయదేవ అష్టపది, నౌకా చరితం వంటి ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంస్కృతిక దిగ్గజాలు డాక్టర్ మద్దాలి ఉషా గాయత్రి (సెంట్రల్ సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ) అండ్ ఏఎస్బిల్ వ్యవస్థాపకులు, సీఈఓ అజితేష్ కొరుపోలు వంటి వారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అజితేష్ కొరుపోలు మాట్లాడుతూ… సంస్కృతి, ఒక సమాజానికి ఆత్మ లాంటిదన్నారు. మనం ఆధునిక జీవన ప్రాంగణాలను నిర్మించేటప్పుడు, వాటిలో భావోద్వేగ, సాంస్కృతిక సంబంధాలను నిర్మించడం కూడా అంతే ముఖ్యమైనదని తాము నమ్ముతున్నామన్నారు. నృత్యప్రియతో తమ భాగస్వామ్యం ఈ నమ్మకం వ్యక్తీకరణ అన్నారు.

Leave a Reply