APPSC | గ్రూప్-2 మెయిన్స్ ‘ కీ ‘ విడుదల

వెలగపూడి – నేడు నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ ‘ ఇనిషియల్ కీ’ ని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులకు ఏమైన ప్రశ్నలు, సందేహాలు ఉంటే https://portal-psc.ap.gov.in/ వెబ్సైట్లో ఫిర్యాదులు చేయవచ్చు.

ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు అభ్యంతరాలు చెప్పేందుకు అవకాశం ఉంటుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.

92 శాతం హాజరు

గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తెలిపింది. ఆదివారం నిర్వహించిన గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 92,250 మంది అభ్యర్థుల్లో 86,459 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వారిలో 92శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ అధికారులు వెల్లడించారు.

అభ్యర్దుల నిరసనలు

పరీక్ష వాయిదా వేయకుండా నిర్వహించడంపై ఏపీపీఎస్సీ తీరుపై కొందరు అభ్యర్థులు అభ్యంతరం తెలిపారు.. పరీక్షకు హాజరుకాకుండా నిరసన వ్యక్తం చేశారు.గ్రూప్-2 నోటిఫికేషన్‌లోని రోస్టర్ విధానంలో పొరపాట్లు జరిగాయనేది కొందరు అభ్యర్థుల ప్రధాన వాదన. ఈ క్రమంలోనే.. ఏపీలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.

గత వైసీపీ ప్రభుత్వంలో నోటిఫికేషన్‌ ఇవ్వగా అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తమకు మద్దతు ఇచ్చిందని.. రోస్టర్ విధానంలోని పొరపాట్లు సరిచేయాలని డిమాండ్ చేసిందని గుర్తు చేశారు.

కానీ.. ఎం ఎల్ సీ ఎన్నికలు రావడంతో గ్రూప్- 2 మెయిన్స్‌ వ్యవహారం సైడ్ అయిపోయిందని ఆరోపించారు. గ్రూప్- 2 నోటిఫికేషన్‌లో జీవో 77 అమలు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపిందని.. ఈ జీవో ప్రకారం మహిళలకు హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయొద్దని ఉన్నప్పటికీ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. ఈ రోస్టర్ విధానాన్ని సరి చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా.. అవేమీ పట్టించుకోకుండా గ్రూప్‌-2 మెయిన్స్‌ నిర్వహించారని అభ్యర్థులు మండిపడుతున్నారు.

పరీక్ష నిర్వహణను దెబ్బతీసేందుకే వాయిదా డిమాండ్‌- ఏపీపీఎస్సీ

ఇదిలావుంటే.. అభ్యర్థుల ఆరోపణలపై ఏపీపీఎస్సీ ఏపీపీఎస్సీ కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్ష నిర్వహణను దెబ్బతీసేందుకే మెయిన్స్‌కు క్వాలిఫైకాని కొందరు వాయిదా కోరారని ఆరోపించింది. ఈ నోటిఫికేషన్‌ రద్దు చేస్తే మళ్లీ కొత్తగా పరీక్ష రాసేందుకు అవకాశం పొందాలనుకుంటున్నారంటూ.. ఈ వ్యవహారంలో కోచింగ్ సెంటర్లపైనా అనుమానం వ్యక్తం చేసింది.

రోస్టర్ పాయింట్ల విషయాన్ని నోటిఫికేషన్‌లో చెప్పలేదని.. గ్రూప్-2 మెయిన్స్‌పై హైకోర్టు మార్గనిర్దేశం ప్రకారమే వెళ్తున్నట్లు తెలిపింది. పరీక్ష సకాలంలో జరగకపోతే నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, కష్టపడిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని స్పష్టం చేసింది. దాంతోపాటు.. ఎన్నికల దృష్ట్యా కోడ్ పరిధిలో పనిచేయాల్సి ఉంటుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.

2023 డిసెంబర్ 7న 899 పోస్టులకు నోటిఫికేషన్

ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 899 పోస్టులు భర్తీ చేసేందుకు 2023 డిసెంబర్ 7న గ్రూప్‌-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షను గత ప్రభుత్వం నిర్వహించింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల హడావుడి జరగడంతో మెయిన్స్ ఆగిపోయింది. ఈ క్రమంలో.. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చాక మెయిన్స్‌ నిర్వహణకు ఏపీపీఎస్సీ షెడ్యూల్‌ ఫిక్స్‌ చేసింది. అయితే.. కొన్ని లోపాలు ఉన్నాయనే ఆరోపణలతో గ్రూప్‌-2 మెయిన్స్‌ వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్‌ చేయగా.. అవేవీ పట్టించుకోని ఏపీపీఎస్సీ పరీక్షను యథాతథంగా నిర్వహించింది.

ఏపీ వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటలకు పేపర్-2 పరీక్ష జరిగింది.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *