వైభవంగా చైత్ర బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

వైభవంగా చైత్ర బ్రహ్మోత్సవాలు ప్రారంభం..
శ్రీ దుర్గామల్లేశ్వరుల దివ్య కళ్ల్యాణ వేడుకలు
ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ శ్రీ దుర్గామల్లేశ్వరి స్వామి వార్ల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పవిత్ర మహోత్సవాల ప్రారంభ కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ తన ధర్మపత్నితో ఆదివారం కలిసి పాల్గొని స్వామి అమ్మవార్ల సేవలో తరించారు. ఉదయం 8 గంటలకు శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా మంగళస్నానాలు నిర్వహించి, అనంతరం వధూవరులుగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది.

సాయంత్రం 4 గంటల నుంచి స్థానాచార్య శివప్రసాద్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, అఖండ దీపస్థాపన వంటి ప్రధాన వైదిక క్రతువులు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ఆహ్వానంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించడం విశేషం. అనంతరం స్వామివారు అమ్మవార్లతో కలిసి వెండి పల్లకీపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ దృశ్యం భక్తుల్లో ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపింది. దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాలను అత్యంత నిష్టతో, వైభవంగా నిర్వహించారు.

