AP | స్టాప్ – వాష్ అండ్ గో..

AP | స్టాప్ – వాష్ అండ్ గో..
AP, శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రతి రోజూ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు “స్టాప్ – వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అన్ని సబ్ డివిజన్‌ల పరిధిలోని నేషనల్ హైవేల పై లారీలు, ప్రైవేట్ ట్రావెలింగ్ బస్సులు, కార్లు, మినీ వ్యాన్లు, లగేజీ బొలేరో వాహనాలను పోలీసులు ఆపి తనిఖీలు చేపట్టారు.
ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవర్‌ల లైసెన్సులు, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు వంటి భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. అర్ధరాత్రి సమయంలో ఎక్కువసేపు వాహనాలు నడిపే డ్రైవర్లలో నిద్రమత్తు కారణంగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి, కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేలా చేసి తదుపరి ప్రయాణానికి అనుమతిస్తున్నారు. దీంతో డ్రైవర్లు అప్రమత్తంగా వాహనాలు నడిపే అవకాశం ఏర్పడుతోందని పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులు డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. వాహనాలను అతి వేగంతో నడపకూడదని, రాంగ్ రూట్‌లో ప్రయాణించకూడదని, పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోకూడదని స్పష్టం చేశారు. అలాగే రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంతో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని పోలీసు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
