AP | భక్తుల భద్రతే ముఖ్యం..

AP | భక్తుల భద్రతే ముఖ్యం..
- అరసవల్లి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి
- హోం మంత్రి అనిత
AP | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : అరసవల్లి క్షేత్రంలో జరిగే రథసప్తమి వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఆమె జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అరసవిల్లి ఉత్సవాల ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ఉన్నతాధికారులతో కలిసి ఆమె ప్రత్యేకంగా సమీక్షించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లను క్రమబద్ధీకరించాలని, ముఖ్యంగా ట్రాఫిక్ మళ్లింపు విషయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి సూచించారు. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, పోలీసు, రెవెన్యూ విభాగాల మధ్య సమన్వయం ఉంటేనే ఉత్సవాలను దిగ్విజయం చేయగలమని ఆమె అన్నారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, రథసప్తమి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు. అనంతరం జిల్లాలోని ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితిపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.
అంతకుముందు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న హోం మంత్రికి జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
