తెలుగువారి ఆత్మగౌరవానికి పుట్టిన పార్టీ టీడీపీ

తెలుగువారి ఆత్మగౌరవానికి పుట్టిన పార్టీ టీడీపీ
మాజీ మంత్రి దేవినేని ఉమా
విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ఎన్టీఆర్ సిద్ధాంతాలు
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : నగరం లోని గొల్లపూడిలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరిపారు. ఈ సందర్భంగా పేదలకు వస్త్రాలు పంపిణీ చేయడంతో పాటు, పార్టీకి విశేష సేవలందించిన సీనియర్ కార్యకర్తలను దేవినేని ఉమా సన్మానించారు.

కార్యకర్తల నినాదాలతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం పుట్టిందన్నారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు టీడీపీ నాంది పలికిందని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు అన్న ఎన్టీఆర్ బీజం వేస్తే, వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధిలో తెలుగువారిని అగ్రగామిగా నిలబెట్టిన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు అని ప్రశంసించారు.

యువగళం పాదయాత్ర ద్వారా వైసీపీ పాలనపై గళమెత్తి, కూటమిని అధికారంలోకి తీసుకువచ్చిన లోకేష్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. 44 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడిందని దేవినేని ఉమా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

